కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా.. కరోనా సోకి.. చికిత్స కోసం ఎదరుచూస్తూనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేట నల్లగంగమ్మ ఆలయం సమీపంలోని జయరామయ్య, సంజీవమ్మ దంపతుల కుమారుడు వి.వెంకటేశ్‌ (38)కు మతిస్థిమితం లేదు. ఆయనకు మూడు రోజులుగా జ్వరం వస్తుంటే ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గలేదు. ఆయాసం కూడా పెరిగిపోవడంతో ఏఎన్‌ఎం సూచనమేరకు కరోనా పరీక్షలకు సిద్ధమయ్యారు.  శుక్రవారం గోపాలవనం ప్రాంతంలో సంజీవని బస్సు వద్దకు సరోజమ్మ కుమారుడిని తీసుకొచ్చారు. క్యూ ఎక్కువగా ఉండటంతో పరీక్షలకు రెండు గంటలు పట్టింది. దీంతో నీరసం ఎక్కువై వెంకటేశ్‌ అక్కడే పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆటో వాళ్లెవరూ ముందుకు రాలేదు. 108కు ఫోన్‌చేస్తే శ్రీకాళహస్తిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.. తాము రాలేమని తేల్చి చెప్పారు.

బుచ్చినాయుడు కండ్రిగలోని 108కు సమాచారమివ్వగా వాళ్లు వచ్చేసరికి 2గంటలు పట్టింది. వారు వెంకటేశ్‌ను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డు ముందు వదిలి వెళ్లిపోయారు. తన కుమారుడికి వెంటనే చికిత్స అందించాలని సరోజమ్మ వైద్య సిబ్బందిని వేడుకున్నా ఎవరూ స్పం దించలేదు. దీంతో వారు అరగంట పాటు బయటే నిరీక్షించారు. అలా నిరీక్షిస్తూనే ఐసోలేషన్‌ వార్డు ముందు వెంకటేశ్‌ తుది శ్వాస విడిచాడు.

కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. కాగా.. అప్పటి వరకు చికిత్స చేయడానికి ముందుకు రాని సిబ్బంది.. ప్రాణాలు విడిచాక మాత్రం అక్కడకు వచ్చి హడావిడి చేయడం గమనార్హం. మృతదేహాన్ని తీసుకువెళ్లి మార్చురీలో పెట్టారు. అయితే.. తమ కుమారుడి శవాన్ని ఇస్తే వెళ్లిపోతానని ఆమె ఎంతవేడుకున్నా ఇవ్వకపోవడం గమనార్హం. కరోనా ఫలితం వచ్చిన తర్వాతే ఇస్తామంటూ తేల్చిచెప్పారు.