నిరుద్యోగ భృతిని 45 ఏళ్ళ వరకూ ఇవ్వాలని యువత కోరుకుంటోంది. ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగభృతి ఇస్తామని పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హమీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా ఇంటికో ఉద్యోగమూ లేదు నిరుద్యోగ భృతీ లేదు.

అయితే, మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా అందుకనే నిరుద్యోగభృతి హామీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. సాధ్యాసాధ్యాలపై మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు. నిరుద్యోగభృతి అమలుపై ఉపసంఘం యువత నుండి అభిప్రాయాలు కోరింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా  జిల్లా స్ధాయిల్లో అభిప్రాయాలను కూడా సేకరించింది.

నిరుద్యోగభృతిని ప్రభుత్వం 40 ఏళ్ళ వరకే వరకే అమలు చేయాలని ఆలోచిస్తోంది. అయితే 45 ఏళ్ళ వరకూ వర్తింపచేయాలని యువత డిమాండ్ చేస్తోంది.  ప్రభుత్వం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకే వర్తింపచేయాలని అనుకుంటోంది. యువతేమో 10వ తరగతి నుండే మొదలుపెట్టాలని కోరుకుంటోంది. విద్యార్హతల ఆధారంగా భృతిని ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే, ప్రతీ ఒక్కరికీ నెలకు రూ. 3 వేలు ఇవ్వాల్సిందేనంటూ యువత డిమాండ్ చేస్తోంది. బ్యాంకింగ్ పరీక్షలకు శిక్షణ ఇప్పించాలని యువత కోరింది.

నిరుద్యోగభృతిని ఇస్తూనే ఉద్యోగాల భర్తీని చేపట్టాలని యువత సూచించింది. అయితే, అభిప్రాయాలను చెప్పిన యువతలో 10 శాతం మంది నిరుద్యోగభృతి వృధా పథకమని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగభృతి ఇవ్వటమంటే ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయటమే కాకుండా యువతను బద్దకస్తులుగా చేయటంగా తెలిపారు.

భృతి ఇవ్వటం కన్నా ఖాళీలను భర్తీ చేయటమే మేలన్నారు. పాఠశాలస్ధాయి నుండి విద్యార్ధులతో ప్రయోగాలు చేయించాలని, రోబోటిక్స్ లాంటి కోర్సులను అందుబాటులోకి తేవాలన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి, విదేశీ విద్యాధరణలో లబ్దిదారులను పక్కన పెట్టాలని, రాజకీయీ జోక్యం సరికాదని కూడా అభిప్రాయపడ్డారు. సరే, ఎప్పటి నుండి అమలు చేస్తుందన్నది పక్కనపెట్టినా ప్రభుత్వం ఏదో హడావుడైతే చేస్తోంది.