యువత గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామాను కోరుతున్నారు.

ప్రభుత్వ ఆంక్షలనుసైతం ఖాతరు చేయకుండా ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని రాష్ట్రంలోని యువత నిర్ణయించుకున్నది. ‘ప్రత్యేక’ పోరాటంలో ముందువరుసలో నిలిచిన యువత గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామాను కోరుతున్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాల్సిన సిఎం అడ్డంకులు సృష్టించటమేమిటంటూ నిలదీస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నం రామకృష్ణా బీచ్ లో నిర్వహింనున్న క్యాండిల్ ఉద్యమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువత విశాఖపట్నం చేరుకుంటున్నది.

ఎప్పుడైతే ఉద్యమంవైపు యువత చురుకుగా కదులుతున్నదో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి ప్రజలు పోరాటం చేసినట్లుగానే తాము కూడా పోరాటం చేసి ప్రత్యేకహోదాను సాధించుకోవాలనే పట్టుదల యువతలో కనబడుతోంది. దానికితోడు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వామపక్ష నేతలు మద్దతుగా నిలవటంతో ఉద్యమానికి ఒక్కసారిగా ఊపువచ్చింది.

దాంతో ఉద్యమాన్ని ఆదిలోనే తుంచేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన ప్రభుత్వం వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. ఉద్యమానికి అనుమతి ఇచ్చేది లేదని డిజిపి సాంబశివరావు హెచ్చరించటం ఇందులో భాగమే. అయితే, డిజిపి ప్రకటనపై యువత, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అరెస్టులకు సిద్ధమే గానీ ఉద్యమం నుండి పక్కకు తప్పుకునేది లేదని గట్టిగా బదులిస్తున్నారు. దాంతో విశాఖలో ఎప్పుడేమవుతుందోనన్న టెన్షన్ మొదలైంది.