అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

గుంటూరు: ఏ చట్టమూ, ఏ పోలీసు మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించలేకపోతున్నారు. మహిళలు, యువతులనే కాదు అభం శుభం తెలియని చిన్నారులనూ కామాంధులు వదిలిపెట్టడం లేదు. ప్రతి నిత్యం దేశంలో ఏదోచోట చిన్నారులు, మహిళలు మృగాళ్ల చేతిలో అఘాయిత్యాలకు గురవుతున్నారు. ఇలా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యానికి యత్నించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా (guntur district) దాచేపల్లి మండలం కేసాన్ పల్లి గ్రామంలో మహ్మద్ అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన కొందరు పిల్లలు ఇంటిబయట ఆడుకుంటుండగా మహ్మద్ గమనించాడు. అందులో ఓ చిన్నారిపై ఈ యువకుడి కన్నుపడింది.

Video

తోటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లాడు యువకుడు. నిర్మానుష్య ప్రాంతంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అతడి రాక్షస ప్రవర్తనతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అటువైపు రావడం చూసి పాపను అక్కడే వదిలేసి పరారయ్యే ప్రయత్నం చేసాడు. కానీ స్థానికులు బాలుడిని వెంబడించి పట్టుకున్నారు. 

బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని అఘాయిత్యానికి యత్నించిన యువకుడికి దేహశుద్ది చేసారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారితో దారుణంగా వ్యవహరించిన యువకుడిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదని... కఠినంగా శిక్షించాలని కేసాన్ పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలో ఓ పదేళ్ళ చిన్నారిపై స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. చదువుల తల్లి నిలయమైన పాఠశాలలోనే ఒంటరిగా కనిపించడమే ఆ చిన్నారితల్లి చేసిన పాపం. బాలికతో తరగతి గదిలోనే నీచంగా ప్రవర్తించాడు కీచక ఉపాధ్యాయుడు. 

పాతబస్తీలోని ఫలక్ నుమా భారత్ కోట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో అష్వాఖ్ అహ్మద్(35) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారి(10) నాలుగో తరగతి చదువుతోంది. అయితే రోజూ మాదిరిగానే శనివారం కూడా బాలికను ఆమె తాత స్కూల్ వద్ద వదిలివెళ్లాడు. స్కూల్ ప్రారంభమవడానికి ఇంకా చాలా సమయం వుండటంతో మిగతా విద్యార్థులెవ్వరూ రాకపోవడంతో తరగతి గదిలో చిన్నారి ఒంటరిగా వుంది. ఇదే సమయంలో స్కూల్ కి వచ్చిన ఉపాధ్యాయుడు అష్వాఖ్ బాలిక ఒంటరిగా వుండటాన్ని గమనించాడు. దీంతో అతడికి పాడుబుద్ది కలిగింది. 

బాలిక వద్దకు వెళ్లిన ఈ కీచకుడు మాయమాటలు చెబుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో అతడి పాడుబుద్దిని గుర్తించిన చిన్నారి తరగతి గదిలోంచి బయటకు వచ్చి అదే స్కూల్లో చదివే తన సోదరుడికి విషయం తెలిపింది. అతడు తండ్రికి ఫోన్ చేసి చెల్లితో టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తెలిపాడు. వెంటనే స్కూల్ వద్దకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు టీచర్ అష్వాఖ్ ను నిలదీసారు. అతడు ఏదో చెప్పి తప్పించుకోడానికి ప్రయత్నించినా బాలిక తండ్రి వెనక్కి తగ్గకుండా ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.