హైదరాబాద్ అందాలను వీక్షించేందుకు బైక్ బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయి దుర్మరణం చెందాడు.
హైదరాబాద్ :గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని హైదరాబాద్ అందాలను వీక్షించేందుకు బయలుదేరిన సాప్ట్ వేర్ ఇంజనీర్లు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా దూసుకొచ్చిన కారు యూటర్న్ తీసుకుంటున్న బైక్ ను ఢీకొట్టడంతో ఓ టెకీ మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణా జిల్లా గొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్(22) ఇంజనీరింగ్ పూర్తవడంతో ఉద్యోగాన్వేషణ చేపట్టాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ప్రముఖ సాప్ట్ వేర్ కంపనీలో ఉద్యోగం లభించింది. ఉప్పల్ సమీపంలోని పోచారంలో కంపనీ వుండటంతో అదే ప్రాంతంలో స్నేహితులతో కలిసి నివాసముంటున్నాడు చరణ్. వీకెండ్ కావడంతో గత శనివారం స్నేహితులతో కలిసి చరణ్ హైదరాబాద్ లోని ప్రముఖ ప్రాంతాల సందర్శనకు బయలుదేరాడు.
మూడు బైక్స్ పై తొమ్మిదిమంది హైదరాబాద్ సందర్శన ప్రారంభించారు. మొదట హుస్సేన్ సాగర్ పరిసర అందాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో వీరంతా ఆనందంగా గడిపారు. అనంతరం హైటెక్ సిటీ ప్రాంతంలోని కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్లే మార్గం ఎవ్వరికీ తెలియకపోవడంతో ఫోన్ లో గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ మెహదీపట్నం వద్ద వీరు దారితప్పి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పివి ఎక్స్ ప్రెస్ వే వైపు వెళ్లారు. కొద్దిసేపటికే దారితప్పినట్లు గుర్తించిన చరణ్ వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన కారు వీరి బైక్ ను ఢీకొట్టింది.
Read More విచక్షణ కోల్పోయిన తల్లి.. పిల్లలపై మరీ ఇంత దారుణమా?
కారు ఢీకొట్టడంతో బైక్ పై వున్న ముగ్గురు యువకులు అమాంతం ఎగిరి రోడ్డుపై పడిపోయారు. అయితే మిగతా ఇద్దరు యువకులు క్షేమంగానే వున్నా చరణ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకులను దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చరణ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇలా గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని దారితప్పిన టెకీ దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన కొడుకు ఇలా మృతదేహంగా తిరిగివస్తున్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
