చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని కర్నూలుకు చెందిన ఓ విద్యార్థి డ్యాన్స్ చేస్తూ మరణించాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

కర్నూలు : హార్ట్ ఎటాక్ లేదా మరే కారణంతోనో సడన్ గా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే చెన్నైలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుకు చెందిన ఓ యువకుడు హఠాన్మరణం పాలయ్యాడు. వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ.. ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కొడుకు సత్యసాయిరెడ్డి (21). ఇతను చెన్నైలో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో.. చదువుకుంటున్నాడు.

ఆదివారం సత్య సాయి రెడ్డి స్నేహితురాలి సోదరి వివాహం జరిగింది. ఇది చెన్నైలోని కోయంబేడులో జరిగింది. ఈ వేడుకలకు సత్యసాయిరెడ్డి వెళ్ళాడు. మిగతా స్నేహితులతో కలిసి డాన్స్ చేశాడు. అలా డాన్స్ చేస్తూ చేస్తూనే అకస్మాత్తుగా ఒక్కసారిగా కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనికి ఫిట్స్ వచ్చాయి. చెవిలోంచి రక్తం కారింది.. కంగారు పడ్డ స్నేహితులు వెంటనే తిరుమంగళం ఆసుపత్రికి సత్యసాయిరెడ్డిని తరలించారు. కాగా అప్పటికే సత్యసాయిరెడ్డి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

మా డబ్బును మేం అడుగుతుంటే.. కాకి లెక్కలేంటీ : జగన్‌ సర్కార్‌పై బొప్పరాజు ఆగ్రహం

ఇదిలా ఉండగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 21న విషాద ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు సిఐ మల్లి నాగేశ్వరరావు (48) సడన్గా వచ్చిన గుండెపోటుతో మృతి చెందారు. మల్లి నాగేశ్వరరావు ఆరు నెలల క్రితమే బదిలీపై అమరావతి నుంచి ఆత్మకూరుకు వచ్చారు. సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు మధ్యాహ్నం విధుల్లో భాగంగా మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయంగా వెళ్లారు. అక్కడ విచారణ ముగించుకుని వచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి, వచ్చారు. 

ఆ సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. నొప్పితో మెలికలు తిరుగులూ కుప్పకూలిపోయారు. కంగారుపడిన తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత నెల్లూరుకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆయన మృతి చెందారు. ఆయన ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డాన్స్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది. అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్.. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో సురేంద్ర కుమార్ దీక్షిత్ డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా… అతనికి గుండెపోటు సడన్ గా గుండెపోటు రావడంతో.. చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్ ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

దీంతో ఆయనతోపాటు అప్పటివరకు డాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ లోని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చి 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరిగింది. దాని కంటే ముందు రోజు మార్చి 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తపాల శాఖ ఉద్యోగి అయిన సురేంద్ర కుమార్ దీక్షిత్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాటకు నృత్యం చేశాడు. అలా చేస్తూనే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.