విశాఖ జిల్లా చోడవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులోని అటవీశాఖ వెదురుడిపో సమీపంలో ఓ యువతి  దారుణ హత్యకు గురయ్యింది. ఈ హత్య యువతి ప్రియుడే చేశాడా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చోడవరం కోటవీధిలో నివాసముండే ఈశ్వరరావు, లక్ష్మి దంపతుల రెండవ కుమార్తె పద్మావతి(17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.     ఈమె మంగళవారం రాత్రి ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోంచి బైటికి వెళ్లిపోయింది. కూతురు ఇంట్లో లేకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. రాత్రి ఎంత వెతికినా యువతి ఆచూకీ తెలియలేదు. మరుసటి రోజు కూడా కుటుంబ సభ్యులే గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని వారు భయపడ్డారు. 

అయితే అటవీశాఖ వెదురు డిపోలో ఓ యువతి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే పద్మావతి కుటుంబ సభ్యులు ఈ  విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. ఆ మృతదేహం పద్మావతిదేనని గుర్తించిన వారు పోలీసులకు తెలియజేశారు. 

అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు, పద్మావతికి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. అతడే ఈ హత్య చేసి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు.