కడప: కేవలం సెల్ ఫోన్ చార్జర్ విషయంలో స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుంది. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కడప జిల్లా వల్లూరు మండలం లింగయ్య పల్లి గ్రామంలో కదాని మధుసూదన్ (22)అనే యువకుడు నివాసముంటున్నారు. అతడి తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందగా తల్లి ఉపాధి నిమిత్తం కువైట్ లో వుంటోంది. దీంతో అతడు అమ్మమ్మ, తాతయ్యల వద్ద వుంటున్నారు. 

అయితే అతడు తాజాగా హత్యకు గురయ్యాడు. ఫోన్ చార్జర్ కోసం స్వల్ప విషయమై కొందరు యువకులు ఇతడితో ఘర్షణ పడి కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది.  అదే గ్రామానికి చెందిన యువకులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలాన్ని కడప రూరల్ సిఐ వినయ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎస్ఐ రాజగోపాల్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.