బెట్టింగ్ కు అలవాటుపడ్డ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
తాడేపల్లి: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ దేశవ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఇదే సమయంలో కొందరు యువత పెడదారి పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ పేరుతో భారీగా డబ్బులు నష్టపోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా బెట్టింగ్ కు అలవాటుపడ్డ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తాడేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నారు విజయసాయి(20). అతడు కె ఎల్ యు లో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ప్రస్తుతం ఐపిఎల్ సందర్భంగా విజయసాయి ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటుపడ్డారు.
ఇలా ప్రతిరోజు మ్యాచ్ లు చూస్తూ బెట్టింగ్ పెడుతున్నట్లు తెలియడంతో తండ్రి యువకున్ని మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన సాయి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కే ఎల్ యు కాలేజ్ సమీపంలోని దీక్ష రెసిడెన్సీ అపార్ట్మెంట్లో స్నేహితుడి రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విజయసాయి ఆత్మహత్యను గుర్తించిన స్నేహితుడు అతడి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
