అనంతపురం: వారిద్దరి కులాలు వేరయినా మనసులు కలిశాయి. కొన్నేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటుండగా ఇటీవలే కుటుంబసభ్యులకు తెలిసింది. వీరి ప్రేమను అంగీకరించని యువతి కుటుంబసభ్యులు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ప్రియుడు తాను ప్రేమించిన ప్రియురాలినే అతి దారుణంగా హతమార్చాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...అనం కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం(19) రఘు(22) ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి ప్రేమాయణం ఇటీవలే బయటపడింది. అయితే ఇద్దరు కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కలిసి బ్రతకలేమని భావించిన ఈ ప్రేమజంట కలిసి చావాలని నిర్ణయించుకున్నారు. 

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోగా రఘు ఆ పని చేశాడు. కానీ షాహిదా భయపడిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. దీంతో ఆస్పత్రిపాలయిన రఘు ఇటీవలే కోలుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ప్రియురాలు తనను మోసం చేసిందని కోపాన్ని పెంచుకున్న అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

ఈ నెల 17వ తేదీన రాత్రి సమయంలో మాట్లాడాలని షాహిదాను పిలిచిన రఘు అతి దారుణంగా హతమార్చాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు అతడిని విచారించిన పోలీసులు యువతిని చంపి హెచ్చెల్సీ కాలువలో పడేసినట్లు గుర్తించారు. దీంతో వారు అక్కడికెళ్లి చూడగా నీటిలో తేలియాడుతూ యువతి మృతదేహం కనిపించింది. ఇది షాహిదా బేగంగా మృతదేహంగా నిర్ధారించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.