తోటి విద్యార్థిని స్నేహితుడే నిప్పంటించి అతి దారుణంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్ల : స్కూల్ విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఒకరి దారుణ హత్యకు దారితీసింది. ఓ విద్యార్థిని తోటి స్నేహితులే పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసిన దారుణం బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా తెలిసీతెలియని వయసులో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణాలే బలవగా మరికొందరు జైలుకు వెళ్లి జీవితాలు నాశనమయ్యాయి.
వివరాల్లోకి వెళితే....చెరుకుపల్లి మండలం రాజోలు సమీపంలోని ఉప్పరివారిపాలెంకు చెందిన ఉప్పల అమర్నాథ్ పదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివుతున్న అమర్నాథ్ పదో తరగతిలో మంచిమార్కులు సాధించాలని ట్యూషన్ కు కూడా వెళుతున్నాడు. రోజూ మాదిరిగానే ఇవాళ(శుక్రవారం) ఉదయం ట్యూషన్ కోసం ఒంటరిగా రాజోలుకు వెళుతుండగా ఊహించని ప్రమాదం ఎదురయ్యింది.
కారణమేంటో తెలీదుగానీ అమర్నాథ్ పై కోపంతో రగిలిపోతున్న స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి దారుణానికి ఒడిగట్టాడు.స్నేహితుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర రెడ్డి మరికొందరితో కలిసి మార్గమధ్యలో కాపుకాసారు. అమర్నాథ్ ఆ దారిలో వెళుతుండగా అడ్డగించిన వీరు వెంటతెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అమర్నాథ్ మంటల్లో కాలిపోతూ చేసిన ఆర్తనాదాలు విని స్థానికులు గుమిగూడారు. అప్పటికే వెంకటేశ్వర రెడ్డి గ్యాంగ్ అక్కడినుండి పరారయ్యింది.
Read More పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారుణం.. నడుస్తున్న రైళ్లో నుంచి వ్యక్తిని తోసేసిన ప్రయాణికులు...
వెంటనే స్థానికులు మంటలు ఆర్పినప్పటికి అమర్నాథ్ శరీరమంతా కాలిపోయింది. అంబులెన్స్ లో హుటాహుటిన గుంటూరు జిజిహెచ్ కు తరలించి బాలుడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో అమర్నాథ్ ప్రాణాలు కోల్పోయాడు.
హాస్పిటల్లో చికిత్స పొందుతూ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించింది వెంకటేశ్వర్ రెడ్డే అని అమర్నాథ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమర్నాథ్ మృతితో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
