రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోతున్నాయ్.  కేంద్రప్రభుత్వంపై మార్చి 21వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసిపి నిర్ణయించింది. ఈ మేరకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన కసరత్తు చేయాలంటూ ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డికి ఆదేశాలు ఇచ్చారు.

వైసిపి ఇవ్వనున్న అవిశ్వాసతీర్మానానికి మద్దతుగా జగన్ తరపున విజయసాయిరెడ్డి జాతీయ పార్టీలతో మంతనాలు మొదలుపెట్టారని సమాచారం. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టటమన్నది జగన్ కు పెద్ద సవాలుగా మారింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టటాన్ని జగన్ కూడా ప్రిస్టేజ్ గానే తీసుకున్నట్లు కనబడుతోంది. అందుకనే జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ జగన్ కు సవాలు విసిరిన 24 గంటల్లోనే జగన్ యాక్షన్లోకి దిగేసారు.

అవిశ్వాసతీర్మానం నోటీసు ఇవ్వటానికి వైసిపి సిద్దపడిన విషయం తేలిపోయింది. అయితే, తర్వాత జరిగే పరిణామాలే ఆసక్తగా మారింది. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానం స్పీకర్ ఆమోదం పొందాలంటే 54 మంది సభ్యుల మద్దతు అవసరం. మద్దతును తాను సంపాదిస్తానని పవన్ మీడియా ముఖంగా జగన్ కు భరోసా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఇచ్చిన మాట ప్రకారం పవన్ మద్దతు సంపాదిస్తారో లేకపోతే పవన్ అవసరం లేకుండా జగనే మద్దతు కూడగట్టుకుంటారో చూడాలి. ఏదేమైనా అవిశ్వాసతీర్మానం ప్రతిపాదన నుండి చంద్రబాబునాయుడు పక్కకు వెళ్ళిపోయింది వాస్తవం. తొలినుండి అవిశ్వాసంపై చంద్రబాబు ఆసక్తి చూపటం లేదు. వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాసతీర్మానం స్పీకర్ ఆమోదం పొందినా వీగిపోయినా తమకే లాభమని జగన్ అంచనా వేసుకుంటున్నారు. మొత్తానికి పార్లమెంటు వేదికగా తెలుగు ఏపి రాజకీయాలు బాగా రవసత్తరంగా మారుతున్నాయి.