వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తాకు అసలైన పరీక్ష ఎదురుకాబోతోందా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయ్. ఈనెల 28వ తేదీన వైసిపి తలపెట్టిన కార్యక్రమమే జగన్ కు పెద్ద సవాలుగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే, చిత్తూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ మంగళవారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. 28వ తేదీన వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అందుకుంటున్నారు. ఆ సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ అనే భారీ కార్యక్రమాన్ని జగన్ తలపెట్టారు. పార్టీ వర్గాలు, వైఎస్సాఆర్, జగన్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ‘జగనన్నతో నడుద్దాం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఆ కార్యక్రమంలో రాష్ట్రంలోని 25 పార్లెమెంటు జిల్లా కేంద్రాలతో పాటు 664 మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పాదయాత్రలో పాల్గొనేవారు ఆరోజు వైఎస్సార్ కు ఎక్కడికక్కడ నివాళుర్పించి పాదయాత్రను మొదలుపెట్టాలని వైసిపి  పిలుపునిచ్చింది.

వైసిపి నేతల ప్రకారం 15 దేశాల్లోని సుమారు 25 నగరాల్లో జగన్ కు సాంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఏర్పాట్లు చేస్తోంది. దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు జగన్ కు మద్దతుగా ఎక్కడికక్కడ పాదయాత్ర చేయాలన్నది వైసిపి ఉద్దేశ్యం. ఆరోజు 700 ప్రాంతాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమంలో లక్షలాది జనాలను భాగస్వాములను చేపటం ద్వారా రికార్డు సృష్టించాలన్నది వైసిపి నేతల ప్లాన్.

వాక్ విత్ జగన్ కార్యక్రమం ద్వారా జగన్ పాదయాత్రకు మరింత విశేష ఆధరణ, స్పందన వస్తుందని వైసిపి భావిస్తోంది. జగన్ పాదయాత్ర మొదలై 70 రోజులవుతున్నా మీడియాలో పెద్దగా కవరేజీ రాలేదన్నది వాస్తవం. అయితే, మిలియన్ మార్చ్(వాక్ విత్ జగన్) కార్యక్రమం ద్వారా మీడియాలో భారీ కవరేజి వచ్చేట్లు చేయాలన్నది వైసిపి నేతల అంతర్గత వ్యూహంగా కనబడుతోంది. పాదయాత్ర ఉద్దేశ్యాన్ని జనాలోకి మరింతగా చొచ్చుకుని వెళ్ళేట్లు చేయాలన్నది జగన్ ప్రధాన ఆలోచన. అందుకు అనుగుణంగానే వైసిపి నేతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వైసిపి వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఆరోజు చూడాల్సిందే.