హోదా బిల్లుకు ఇటు రాజ్యసభలోనూ, అటు లోక్ సభలో కూడా కాంగ్రెస్, వైసీపీలు కలిపి ఉద్యమిస్తే టిడిపిపైన కూడా ఒత్తిడి పెరగటం ఖాయం.
ప్రత్యేకహోదా సాధన కోసం త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నది. ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టటం ద్వారా కేంద్రంపై ‘హోదా’ ఒత్తిడి పెంచాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అందుకు మద్దతిచ్చే జాతీయ పార్టీలను కూడగట్టాలని నిర్ణయించటం మంచిదే. గతంలోనే ఇదే విషయమై కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఇంకా రాజ్యసభలో పెండింగ్ లోనే ఉంది.
అప్పట్లో కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుకు జాతీయస్ధాయిలో 11 పార్టీలు మద్దతు పలికాయి. మొదట్లో టిడిపి సభ్యుడు సుజనా చౌదరి ఈ బిల్లుపై మాట్లాడుతూ ‘నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాద’ని హేళన చేసారు. అయితే తర్వాత మద్దతివ్వక తప్పలేదనుకోండి అది వేరే సంగతి. ఇపుడు కూడా టిడిపి సభ్యులు అంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తారని ఎవరు అనుకోవటం లేదు. గతంలోనే కాంగ్రెస్ బిల్లును ప్రవేశపెట్టి ఓటింగ్ కు పట్టుపట్టింది కాబట్టి ఇపుడు వైసీపీ ప్రవేశపెట్టే బిల్లుకూ కాంగ్రెస్ మద్దతివ్వటం ఖాయమే.
అదేసమయంలో బిల్లుకు జాతీయస్ధాయిలో మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్, వైసీపీలు సంయుక్తంగానే ప్రయత్నించాలి. హోదా బిల్లుకు ఇటు రాజ్యసభలోనూ, అటు లోక్ సభలో కూడా కాంగ్రెస్, వైసీపీలు కలిపి ఉద్యమిస్తే టిడిపిపైన కూడా ఒత్తిడి పెరగటం ఖాయం. అదేసమయంలో మిగిలిన పార్టీల మద్దతూ సంపాదించగలిగితే మళ్ళీ కేంద్రంపై ఒత్తిడి పెరిగుతుంది అనటంలో సందేహం అక్కర్లేదు. రానున్నది బడ్జెట్ సమావేశాలు కాబట్టి బిల్లులకు రాజ్యసభలో మద్దతు పొందాలంటే ప్రతిపక్షాల సహకారం చాలా అవసరం. కాబట్టి ప్రతిపక్షాలు గనుక హోదా కోసం పట్టుపడితే భాజపా ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి.
