వచ్చే ఎన్నికల్లో వైసిపికి 135 సీట్లు వస్తాయట. వైసిపి ఏమీ సర్వేలు చేయించుకుని చెప్పిన లెక్క కాదులేండి. ఉగాది సందర్భంగా గుంటూరు జిల్లాలోని కాకుమాను గ్రామంలో జరిగిన పంచాంగ శ్రవణంలో చెప్పిన జోస్యం. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కాకుమాను గ్రామంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. పంచాంగం వినిపించిన పండితులు వైసిపి ఏకంగా 135 సీట్లు వస్తుందని చెప్పటం గమనార్హం. అదే విధంగా 12 ఏళ్ళపాటు జగన్ అధికారంలో ఉంటారని కూడా చెప్పారు.

మొత్తం మీద పంచాంగ శ్రవణం కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పేస్తున్నాయి. ఎవరు ఎన్ని సంవత్సరాలు అధికారంలో కూడా చెబుతుండటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో కూడా పంచాంగ శ్రవణం జరిగింది. అక్కడ పంచాంగం వినిపించిన పండితులు చంద్రబాబు అధికారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనే చెప్పారు. భవిష్యత్ ఎవరు చెప్పినా? ఎవరిక చెప్పినా ఒకే విధంగా ఉండాలి. అంతేకాని జగన్ ఆధ్వర్యంలో జరిగే పంచాంగ శ్రవణం ఒకలాగ, చంద్రబాబు దగ్గర చెప్పే పంచాంగ శ్రవణం ఒకలాగ ఎలా ఉంటాయి?

పంచాంగ శ్రవణం వినిపించే పండితులు కూడా పార్టీలను బట్టి, వ్యక్తులను బట్టి తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో అసలు పంచాంగ శ్రవణమంటేనే జనాలు పెద్ద జోకుల్లాగ తీసుకుంటున్నారు.