పంచాయతీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ హవా
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలను పట్టుబట్టి నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్గ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్ గా వైసీపి మద్దతుదారు విజయం సాధించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇల్లు ఉన్న వార్డులో వైసీపీ మద్దతుదారు విజయం సాధించారు. గ్రామ సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటితో గెలుచుకున్నారు. రమేష్ కుమార్ ఇల్లు ఉన్న వార్డులో వైసీపీ మద్దతుదారు ఆత్మకూరు నాగేశ్వర రావు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పడగా, అందులో నాగేశ్వర రావుకు 256 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుదారుకు 145 ఓట్లు వచ్చాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ పట్టుబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది. తొలి విడత ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.
ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం వైసీపీ మద్దతుదారాలు 2319 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతుదారులు 444 మంది విజయం సాధించారు. బిజెపి, జనసేన కూటమి మద్దతుదారులు 31 మంది విజయం సాధించారు. ఇతరులు 56 మంది గెలిచారు.
తొలి విడత 3249 స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇప్పటి వరకు 2,850 గ్రామాల ఫలితాలు వెలువడ్డాయి. తొలి విడత పోలింగ్ మంగళవారం జరిగింది. మంగళవారం సాయంత్రమే ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది.