సంక్షోభానికి కారణమైన కేంద్రంపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయలేక, అలాగని సర్దుకుపోలేక అవస్తలు పడుతున్నారు.

చంద్రబాబునాయడును ఇబ్బంది పెట్టటానికి వైసీపీ అదును చూసి సరికొత్త రాజకీయానికి తెరలేపింది. అసలే పెద్ద నోట్ల రద్దుతో బేజారుగా ఉన్న ముఖ్యమంత్రిని కలిసి తమ డిమాండ్లు చిట్టా వినిపించనున్నారు. నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని, తమ నియోజక వర్గాల్లో ఓడిపోయిన టిడిపి నేతల పేర్లతో నిధులు మంజూరు చేస్తున్న విషయమై చర్చించనున్నారు.

పనిలో పనిగా రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న విషయాన్ని కూడా సిఎం దృష్టికి తీసుకెళ్ళేందుకు వైసీపీ డాక్యుమెంట్ సిద్ధం చేసింది. గడచిన రుండున్నరేళ్లలో వైసీపీ ఎంఎల్ఏలు ఎప్పుడూ సిఎంను కలవటానికి ప్రయత్నించింది లేదు. వైసీపీ శాసనసభ్యులున్న నియోజవకర్గాల్లో టిడిపి ఇన్ చార్జీల పేర్లతో నిధులు మంజూరు అవుతున్న విషయమూ కొత్త కాదు.

అయితే, నోట్ల రద్దు నేపధ్యంలో ఇప్పుడే వైసీపీ ఎంఎల్ఏలు చంద్రబాబును ఎందుకు కలుస్తున్నారన్నదే కీలకం. నోట్ల రద్దు కారణంగా ఓవైపు రాష్ట్ర ఆదాయం పడిపోయింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లు ఇవ్వాల్సిన రోజు దగ్గర పడుతున్నది. జీతాలు, పెన్షన్లకే ప్రభుత్వం సుమారు రూ. 3500 కోట్లు వ్యయం చేయాలి. ఇక, సంక్షేమ పథకాలకు మరో రూ. 3000 కోట్లు సిద్ధం చేయాలి.

మొదటి వారంలోనే సుమారు రూ. 6 వేల కోట్లను ఏ విధంగా సర్దుబాటు చేయాలో సిఎంకు అర్ధం కావటం లేదు. ఇంకో వైపు కేంద్రం రాష్ట్రావసరాలకు సరిపడా నిధులను పంపిణీ చేయటం లేదు. దాంతో చంద్రబాబులో రోజురోజుకు ఆందోళన పెరిగిపోతోంది. సంక్షోభానికి కారణమైన కేంద్రంపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయలేక, అలాగని సర్దుకుపోలేక అవస్తలు పడుతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ప్రతిపక్షం వైసీపీ కూడా చంద్రబాబును ఇరుకున పెట్టే వ్యూహానికి తెరలేపటం గమనార్హం.