న్యూఢిల్లీ: తనకు లభించిన వెసులుబాటును వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరుకు వాడుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినితి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన కేంద్ర జలశక్తి మంత్రి గజెంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించే పేరుతో పెద్ద యెత్తున సొమ్ము దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు 

బుధవారంనాడు ఆయన గజేంద్ర షెకావత్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిర్వాసితులకు పునరావస పరిహారం చెల్లింపు పేరుతో నకిలీ ఖాతాలను, దొంగ లబ్ధిదారులను సృష్టించి భారీగా సోమ్ము చేసుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచేశారని, 25 శాతం కమిషన్లు కొట్టేశారని ఆయన అన్నారు 

ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన అన్నారు. తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన గజేంద్ర షెకావత్ ను కోరారు దాదాపు గంట పాటు ఆయన గజేంద్ర షెకావత్ తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపైనే కాకుండా తనను  ప్రభుత్వం వేధిస్తున్న తీరును కూడా వివరించారు.

ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, కుంభకోణాలను మీడియా ద్వారా బయటపెడుతున్నందుకే తనపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆయన ఆరోపించారు అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేయడం వల్లనే తనపై రాజద్రోహం కింద కేసు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఐడి పోలీసులతో తనపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. సిఐడి కస్టడీలో తనను గాయపరిచారని ఆయన చెప్పారు. తన అరిపాదాలకు అయిన గాయాలను ఆయన గజేంద్ర షెకావత్ కు చూపించినట్లు తెలుస్తోంది.