అత్యాచారాలు, అప్పుల్లో ఏపీ నెంబర్‌వన్.. ఇది జగన్ ఘనతే : రఘురామ కృష్ణంరాజు సెటైర్లు
అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, గంజాయి, అప్పుల్లో జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టారంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకోవడం దారుణమన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, గంజాయి, అప్పుల్లో జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టారంటూ సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రఘురామ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న చంద్రబాబు రోడ్ షోలకు జనాలు పోటెత్తుతున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.
ALso REad: ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటే ఇంతవరకు జీతాలు ఎందుకివ్వలేదు..: టీడీపీ
ఇకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ జేఏసీ (అమరావతి) ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనీ, ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏపీ జేఏసీ (అమరావతి) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 13న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. జీతాలు, పింఛన్లు ఆలస్యంగా అందజేయడం, బకాయిలు, అలవెన్సులు పెండింగ్‌లో ఉండడం, పాత పెన్షన్ విధానం అమలుకాకపోవడం వంటి పలు అంశాలపై జేఏసీ నేతలు చర్చించారు. సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు, 26 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. జాప్యం లేకుండా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించడంలో, అలవెన్సుల విడుదల వంటి ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైతే సంక్రాంతి పండుగ తర్వాత ఉద్యోగులు ఆందోళనకు దిగుతారని పేర్కొన్నారు.