ఆసక్తికర దృశ్యం...టిడిపి సభ్యులతో కలిసే అసెంబ్లీకి కోటంరెడ్డి, శ్రీదేవి
ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ప్రతిపక్ష టిడిపి సభ్యులతో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాల ప్రారంభంరోజు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అధికార వైసిపి నుండి సస్పెన్షన్ కు గురయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. శ్రీదేవి అయితే ఏకంగా టిడిపి శాసనసభా పక్షం 'షెల్ కంపనీల సృష్టికర్తు జగన్ రెడ్డి' అంటూ రూపొందించిన ప్లకార్డు చేతబట్టి... చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
ఇక ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అక్కడినుండి ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. 'చంద్రబాబుపై కక్ష - యువత భవితకు శిక్ష' అంటూ రాసిన బ్యానర్ ను చేతబట్టి టిడిపి సభ్యులు అసెంబ్లీకి చేరుకున్నారు.
అయితే శాసన సభా సమావేశం ప్రారంభమవగానే రభస మొదలయ్యింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసారని... దీనిపై సభలో చర్చించాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. స్పీకర్ కు వాయిదా తీర్మానం అందించిన టిడిపి సభ్యుల దీనిపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించకపోవడంతో టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు.
Read More ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యుల ఆందోళన
టిడిపి ఆందోళనలతో శాసన సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేసారు. అలాగే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వారికి వైసిపి నాయకులు కూడా కౌంటర్ ఇవ్వడంతో సభలో రభస తారాస్థాయికి చేరుకుంది.