ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు.జాతీయ గీతాలాపనతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేపట్టారు.ఈ విషయమై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టబట్టారు.స్పీకర్ పోడియం వద్ద ప్ల కార్డులతో నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. మరో వైపు టీడీపీ సభ్యుల నిరసనలకు కౌంటర్ గా వైసీపీ సభ్యులు కూడ నిరసనకు దిగారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సభలో పోటా పోటీగా నిరసనలకు దిగారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం లేచి నిలబడి సభ్యులకు దండం పెట్టారు. తమ తమ స్థానాల్లో వెళ్లి కూర్చోవాలని కోరారు. ఈ సమయంలో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో ఏపీ అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు టీడీపీ సభ్యులు. అయితే చర్చకు తాము సిద్దంగా ఉన్నామని కూడ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరో రూపంలో చర్చకు రావాలని ప్రభుత్వం టీడీపీ సభ్యులకు సూచించింది. అయితే వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ పట్టుబడింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.