రోజులుగా నానుతున్న విషయానికి కేశినేని తెరదించారు. ఎన్నో అవమానాలు పడుతూ టీడీపీలో వున్నానని.. ఆస్తులు కూడా అమ్ముకున్నానని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విజయవాడ నియోజకవర్గం కోసమే పార్టీలో నెట్టుకొస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమేనని అంతా ఫిక్స్ అయ్యారు. 

రోజులుగా నానుతున్న విషయానికి కేశినేని తెరదించారు. ఎన్నో అవమానాలు పడుతూ టీడీపీలో వున్నానని.. ఆస్తులు కూడా అమ్ముకున్నానని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విజయవాడ నియోజకవర్గం కోసమే పార్టీలో నెట్టుకొస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమేనని అంతా ఫిక్స్ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం తన మనసులోని మాటను మీడియాకు తెలిపారు. జగన్‌తో సమావేశం అనంతరం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి , లోక్‌సభ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. 

అంతా బాగానే వుంది కానీ.. వైసీపీలో చేరడానికి జగన్ నుంచి కేశినేని నానికి ఎలాంటి ఆఫర్ అందింది అనే దానిపై విజయవాడలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా తనకు మరోసారి ఎంపీ సీటు కావాలని తెలుగుదేశంలో వున్నప్పుడే ఆయన పట్టుబట్టారు. తనకు కాకుండా మరొకరికి అధిష్టానం టికెట్ కేటాయిస్తున్నట్లు కన్ఫర్మ్ చేయడంతో ఇక పార్టీని వీడాలని నాని డిసైడ్ అయ్యారు.

బెజవాడ నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని కేశినేని నాని గట్టి పట్టుదలతో వున్నారు. గతంలో 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి లగడపాటి రాజగోపాల్ వరుసగా రెండుసార్లు విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం ఖాయం చేసుకోవాలని అనుకున్నా.. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలను పక్కనబెట్టారు. 

టీడీపీ నుంచి మొండిచేయి ఎదురుకావడంతో కేశినేని నాని తనకు ఎంపీ టికెట్ ఇచ్చే పార్టీ వైపు ఆయన అడుగులు వేశారు. అలాగే తన కుమార్తె కేశినేని శ్వేతను విజయవాడ తూర్పు లేదా పశ్చిమ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలనేది నాని ఆలోచన. గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ టికెట్ తృటిలో చేజారిపోవడంతో ఈసారి పట్టు సడలనివ్వకూడదని కేశినేని నాని ఫిక్స్ అయ్యారు.

టీడీపీలో వుంటే తూర్పు నుంచి గద్దె రామ్మోహన్‌ను కాదని తన కుటుంబానికి టికెట్ దక్కదని నానికి తెలియనిది కాదు. సరిగ్గా ఇదే సమయంలో తమకు కొరకరాని కొయ్యగా వున్న విజయవాడ ఎంపీ సీటు, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న వైసీపీకి అన్ని రకాలుగా బలమైన కేశినేని నాని దొరకడంతో జగన్ పార్టీ ఆయనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చినట్లుగా కథనాలు వస్తున్నాయి.