అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రాజకీయం హాట్ హాట్ గా నడుస్తుంది. రాజధాని ప్రాంత రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఏదో కేవలం రాజధాని గ్రామాలకు మాత్రమే పరిమితమైన ఈ ఉద్యమం ఇప్పుడు కృష్ణ, గుంటూరు జిల్లాలకు కూడా పాకింది. అనుకున్న దానికన్నా ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. గ్రామాల్లోని ప్రజలు స్వచ్చందంగా వీధుల్లోకి రావడం అధికార వైసీపీని కలవరపెడుతోంది. 

ఈ పరిస్థితులు నెలకొని ఉన్నవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారా కూడా మోగింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని గ్రామాల్లో గనుక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే జగన్ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. 

ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల ను అమరావతి పరిధిలోని గ్రామాల్లో నిర్వహించకుండా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. 

అందుకోసం ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ నుంచి ఎన్నికల కమిషన్ కి ఈ లేఖ రాయడం జరిగింది. అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాలను మునిసిపాలిటీల్లో కలపనున్నట్టు, మిగిలినవాటిని కలిపి అమరావతి కార్పొరేషన్ ని రూపుదిద్దాలని అనుకుంటున్నారట. 

Also read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి..

అందుకోసం త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఎర్రపాలెం.. బేతపూడి.. నవులూరులను మంగళగిరి మున్సిపాలిటీల్లో కలపాలని.. పెనుమాక.. ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీ లో కలపాలన్నది ప్రతిపాదనగా చెబుతున్నారు. 

ఈ గ్రామాలు పోగా... మిగిలిన గ్రామాల్ని కలిపేసి అమరావతి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నది జగన్ సర్కారు తలంపు. ఇలా గనుక ఎన్నికలను పొడిగించగలిగితే... అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను వైసీపీ తప్పించుకునే వీలుంటుంది.