రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్
వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 29న లోక్‌సభ స్పీకర్‌తో వైసీపీ ఎంపీలు భేటీ కాబోతున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కోరారు. దాంతో సుమిత్రా మహాజన్‌ను వ్యక్తిగతంగా కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ ఆఫీసు నుంచి లేఖ వచ్చింది. ఈనెల 29 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఆహ్వానిస్తే ఎప్పుడైనా సిద్ధమని ఇటీవలే వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. దీంతో జూన్ 1 సుమిత్రాతో భేటీ కావాలని ఈ నెల 19న స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు లేఖ వచ్చింది. ఆ తరువాత స్వల్ప మార్పులతో 29న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ వైసీపీ ఎంపీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
దీనిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
