వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ట్విట్టర్ లో కౌంటర్లు వేశారు. ఇటీవల.. చంద్రబాబుకి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై కౌంటర్ వేశారు. పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేసి ఉంటారని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా కాల్‌ చేసి మాట్లాడారని గుర్తు చేశారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.

'ఏం మొహం పెట్టుకుని ఏపీకి వస్తాడు. మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీ మర్చిపోయుంటాడని అనుకుంటున్నాడు. ఆయనది అపార జ్ఞాపకశక్తి. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరు' అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేశారు.