వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత వారి కుటుంబసభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. గొడవలు జరిగితే రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయించొచ్చని చంద్రబాబు భావించారని అయితే అది నెరవేరకపోవడంతో రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారని విజయసాయి ఆరోపించారు.

వివేకాను నరికి చంపారని తెలిస్తే కార్యకర్తలు ఆవేశాలకు లోనై హింసకు పాల్పడేవారని.. అలా జరగకూడదనే దు:ఖాన్ని దిగమింగుకుని మధ్యాహ్నం వరకు అసలు విషయాన్ని వైఎస్ కుటుంబ సభ్యులు బయటకు చెప్పలేదన్నారు.

లేఖ వెంటనే ఇస్తే పోలీసులు డ్రైవర్ ప్రసాద్ పేరు వెంటనే బయట పెట్టేవారు. అతని ప్రాణానికి హానీ ఉండేదని విజయసాయి స్పష్టం చేశారు. పరిటాల రవి హత్య తర్వాత రాష్ట్రంలో హింసను ప్రేరేపించన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు.

అన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులకు ఫోన్ చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలో.. ఎవరెవరి ఆస్తులు ధ్వంసం చేయాలో చెప్పడం అందరికీ తెలుసునన్నారు. వైఎస్ వివేకా హత్య కుటుంబ గొడవల వల్లే జరిగిందని దర్యాప్తు మొదలు కాకముందే సీఎం తేల్చేశారని విజయసాయి మండిపడ్డారు.

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం విఫలమయ్యాకా కూడా ముఖ్యమంత్రి ఇదే విధంగా మాట్లాడారని.. అదే తానైతే అక్కడే పడిపోయి నానా హంగామా చేసే వారని విజయసాయి సెటైర్లు వేశారు.

జగన్ పరిణితి చెందిన రాజకీయ నేత కాబట్టే హుందాగా వ్యవహరించి ప్రథమ చికిత్స తర్వాత వెంటనే హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఆయన గుర్తు చేశారు. అలా వెంటనే హైదరాబాద్‌కు ఎలా వెళ్తారని..? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా?? అసలు భయపడకపోవడమేంటి..? అయితే తనే పొడిపించుకుని ఉంటాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విజయసాయి ప్రస్తావించారు.

జగన్ ఈ విషయంపై ఏం మాట్లాడకముందే కుల మీడియాను పిలిపించుకుని ఆయన అభిమానే హత్యాయత్నం చేశాడని చంద్రబాబు ప్రకటించారన్నారు. సానుభూతి వస్తుందని ఇలా చేసానని నిందితుడు చెప్పాడని, హేళన చేస్తూ మాట్లాడారని ఇది ముఖ్యమంత్రి నిజ స్వభావమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.