చెల్లెమ్మా పురందేశ్వరి!.. పగోడికి కూడా నీలాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయి రెడ్డి
చివరి రోజుల్లో తండ్రి ఎన్టీఆర్ కు పురందేశ్వరి పట్టెడన్నం కూడా పెట్టలేదు... కానీ భర్త, బావతో కలిసి ఆయన సీఎం పదవిలోంచి కిందకు లాగిపడేసారని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
విశాఖపట్నం : వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య కొంతకాలంగా మాటలయుద్దం సాగుతోంది. తాజాగా మరోసారి పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. చెల్లెమ్మా పురందేశ్వరి అంటూనే తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కన్నతండ్రి ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సాధించుకున్న అధికారాన్ని భర్త, బావ లతో చేతులుకలిపి నిర్దాక్షిణ్యంగా లాగిపడేసావు... ఏం కూతురివమ్మా నీవు? అంటూ మండిపడ్డారు. శత్రువులకు కూడా ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా! అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
చివరి రోజుల్లో తండ్రి ఎన్టీఆర్ కు పురందేశ్వరి పట్టెడన్నం కూడా పెట్టలేదని అన్నారు. తండ్రి ఇంటికి పదడుగుల దూరంలో వుండికూడా అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ను కన్నకూతురు పురందేశ్వరి పట్టించుకోలేదని అన్నారు. కానీ వయసు మీదపడినా, అనారోగ్యంతో బాధపడుతూనే ఎంతో కష్టపడి టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చారు ఎన్టీఆర్... అలాంటిది బావ చంద్రబాబుతో కలిసి ముఖ్యమంత్రి సీట్లోంచి తండ్రిని లాగిపడేసిన గొప్ప కూతురు పురందేశ్వరి అని ఎద్దేవా చేసారు. పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను ఎంత బాధపెట్టావు అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
ఇక పురందేశ్వరి కులం, కుటుంబ రాజకీయాలు చేస్తారని విజయసాయి ఆరోపించారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లే... పురందేశ్వరి ఏం చేసినా అందులో స్వార్థ ప్రయోజనాలే వుంటాయన్నారు. ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్థంతో కూడుకున్నవేనని అన్నారు. ఆమె అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే" అని విజయసాయి రెడ్డి అన్నారు.
Read More వాలంటీర్ పై వైసిపి ఎంపిటిసి అత్యాచారయత్నం... బాధితురాలి ఆవేదన ఇదీ : నారా లోకేష్ (వీడియో)
పురందేశ్వరికి సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు... కేవలం స్వార్థం తప్ప అని అన్నారు. ఇలాంటి నాయకురాలు వుండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమని విజయసాయి అన్నారు.