వాలంటీర్ పై వైసిపి ఎంపిటిసి అత్యాచారయత్నం... బాధితురాలి ఆవేదన ఇదీ : నారా లోకేష్ (వీడియో)
వైసీపీ నేతల దాష్టీకాలకు వారి పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లు కూడా బలవుతున్నారని నారా లోకేష్ అన్నారు. మహిళా వాలంటీర్ పై వైసిపి ఎంపిటిపి అత్యాచారయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు.
అమరావతి : ప్రతిపక్ష పార్టీల వారినే కాదు సొంత పార్టీ వారినీ వైసిపి నాయకులు వదిలిపెట్టడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లాలో మహిళా వాలంటీర్ పై వైసిపి ఎంపిటిసి అత్యాచారయత్నానికి పాల్పడటంపై లోకేష్ సీరియస్ అయ్యారు. తనకు వైసిపి నేతలతో ప్రాణహాని వుందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్న వీడియోను లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
''వైసీపీ నేతల దాష్టీకాలకు వారి పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లు కూడా బలవుతున్నారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ వాలంటీర్ వేదపై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణం. స్థానిక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. బాధిత వాలంటీర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే.. సామాన్య మహిళలకు జగన్ పాలనలో రక్షణ లేదని స్పష్టం అవుతోంది'' అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
వీడియో
ఇదిలావుంటే దళితులపై జరుగుతున్న వరుస దాడులపైనా నారా లోకేష్ స్పందించారు. వైసిపి ప్రభుత్వ తీరువల్లే దళితులపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. దళితులపై దాడులు చేస్తున్నవారిపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోవడంలేదని... అందువల్లే వారిపై దాడులు మరింత ఎక్కువ అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకపర్వంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని లోకేష్ కోరారు.
Read More తెలంగాణ అబ్బాయి - ఏపీ ట్రాన్స్ జెండర్ ప్రేమాయణం... పెళ్లికి సిద్దమైన ప్రేమజంట (వీడియో)
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో దళితుడైన నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసిపి నాయకుడు దాడికి పాల్పడటంపై లోకేష్ సీరియస్ అయ్యారు. స్థానిక వైసిపి నాయకుడు ముత్తారెడ్డి కులంపేరుతో కోటేశ్వరరావును దూషించి అవమానించడమే కాదు కుటుంబంపై దాడికి పాల్పడ్డాడని అన్నారు. గాయాలతో వారు హాస్పిటల్ కు వెళ్లినా వైద్యం అందించేందుకు సిబ్బంది నిరాకరించారని... పోలీసులు కూడా దాడికి పాల్పడిన ముత్తారెడ్డిపై కేసు నమోదు చేయడంలేదని లోకేష్ అన్నారు.
ఇక కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ దాడికి పాల్పడిన ఘటనపైనా లోకేష్ స్పందించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువకుడు దాహంగా వుంది నీళ్లు కావాలని అడిగితే ముఖంపై మూత్రంపోయడం దారుణమని అన్నారు. ఇలా దళిత యువకుడిని చావబాది ముఖంపై మూత్రంపోసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించకుండా చిన్నచిన్న బెయిలబుల్ కేసులు పెట్టారని లోకేష్ అన్నారు.