చంద్రబాబునాయుడు అవినీతిపై ప్రధానమంత్రికి వైసిపి ఫిర్యాదు చేసింది. ఆ విషయాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే స్వయంగా మీడియాతో చెప్పారు. గడచిన నాలుగేళ్ళల్లో చంద్రబాబు రూ. 1.2 లక్షల కోట్ల అప్పు తెచ్చారట. ఆ డబ్బంతా ఏమైందని ఎంపి నిలదీస్తున్నారు. తెచ్చిన అప్పే కాకుండా కేంద్రం నుండి వచ్చిన కోట్లాది నిధులు కూడా ఏమయ్యాయో అర్ధం కావటం లేదన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో జనాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపి చెప్పారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అవినీతిపై విచారణ జరిపించాలని తాను కోరిన విషయాన్ని ఎంపియే వెల్లడించారు. అవినీతి వ్యవహారాల్లో చంద్రబాబును బోనెక్కెంచేలా చేయాల్సిందంతా చేస్తామన్నారు. కోట్లాది రూపాయలను చంద్రబాబు హవాలా ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపించారు. చట్టప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకూ వదిలిపెట్టేది లేదని ఎంపి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.