వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంత సాహసానికి పూనుకున్నారో. తమ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోవటం లేదన్న కోపమో లేకపోతే రాష్ట్ర సమస్యను అందరికీ తెలియజేయాలన్న తాపత్రయమో తెలీదు. మొత్తానికి విజయసాయి పెద్ద సాహసమే చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ సాధన పేరుతో ఎంపి పార్లమెంటు పై అంతస్తుకు చేరుకుని నిరసన మొదలుపెట్టారు. ఎంపిని భవనంపైన చూసిన సహచరులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ విజయసాయిరెడ్డి గురువారం పార్లమెంట్‌ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హోదా సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే రాష్ట్రాని​కి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి  టీడీపీ మద్దతు ఇవ్వాలని విజయసాయి రెడ్డి కోరారు. భద్రతా సిబ్బంది ఎంపి వద్దకు చేరుకుని క్రిందకు తీసుకొచ్చారు.