వచ్చే ఎన్నికల్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతిస్తారా? వైసిపి ఎంపి వరప్రసాద్ మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.  ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో గురువారం ఆందోళనలు చేస్తున్న వరప్రసాద్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.

వరప్రసాద్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే ‘జగన్ తోనే జనసేన వుంటుందంటున్నారు వరప్రసాద్. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్ళి కలిశారట. వైకాపా తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నదని పవన్ అడిగినట్లు ఎంపి చెప్పారు. జనసేనను అవినీతి పార్టీ అని వైసిపి  ఎందుకు ఆరోపణలు చేస్తున్నదని అడిగారట.

‘పోలవరం సందర్శనకు వైసిపి వెళ్తున్నదని  తెలిసి మీరు ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే మీరు తెదేపాతో ఉన్నారని మీపై విమర్శలు చేశామ’ని చెప్పారట. ‘తాను తెదేపాతో ఎంతమాత్రం లేనని, అవసరమైతే జగన్ కే మద్దతు ఇస్తాన’ని పవన్ చెప్పారని ఎంపి అన్నారు. ఎన్నికల తరువాత జగన్ కు అవసరమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తామని హామీ ఇచ్చారట. ప్రత్యేక హోదా సాధన విషయంలో జనసేన, వైకాపాలు పరస్పరం మద్దతుతో పోరాటం చేస్తామని వరప్రసాద్ చెప్పారు.