చంద్రబాబు అరెస్ట్ : జగన్ వాడిన భాష.. దిగజారుడుతనానికి నిదర్శనం...
చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ వాడిన భాష దారుణంగా ఉందంటూ విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి విరుచుకుపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడిన భాషపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడుని అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు వాడుతున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ‘తాను లండన్ లో ఉన్నప్పుడే… చంద్రబాబును పోలీసులు ఎత్తేశారు’ అంటూ జగన్మోహన్ రెడ్డి ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిమీద ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, ఐదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని గుర్తు చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసు .. ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, రేపు మళ్లీ రమ్మన్న అధికారులు
అలాంటి వ్యక్తి విషయంలో…ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఇలాంటి వ్యక్తి వాడిన భాష బజారు భాషలా ఉందని.. ఆయన దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. డ్రైవర్ ను హత్య చేసి.. శవాన్ని పార్సిల్ చేసిన అనంత బాబుకు బెయిల్ లభించిందని.. బెయిల్ మీద బయటకు వచ్చిన అనంతబాబు తమ పార్టీ కార్యక్రమాల్లో దర్జాగా పాల్గొంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఇక మాజీ మంత్రి, ముఖ్యమంత్రి బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని సిబిఐ చార్జి షీటు దాఖలు చేసిందని గుర్తు చేశారు. కానీ, ఆయనను అరెస్టు చేయలేకపోయిందని.. చివరికి అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ దొరికిందని తెలిపారు. మరోవైపు.. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మీద అన్యాయంగా కేసు నమోదు చేశారని… అలాంటి వ్యక్తికి బెయిల్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతబాబు, అవినాష్ రెడ్డిల మీద ఐపిసి 32 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినా… బెయిల్ దొరికిందని అన్నారు.