Asianet News TeluguAsianet News Telugu

ఈ సారి ఎన్నికల్లో ‘వార్ వన్ సైడే’.. టీడీపీదే అధికారం.. రఘురామ కృష్ణంరాజు సర్వే..

వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చేయించిన సర్వేలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తేలిందని అన్నారు. 

YCP MP raghurama krishnam raju Survey on upcoming elections in Andhrapradesh
Author
Hyderabad, First Published Aug 23, 2022, 8:35 AM IST

ఢిల్లీ : రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ‘వార్ వన్ సైడే’ అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. విస్తృతస్థాయి శాంపిల్స్ తో శాస్త్రీయంగా తాను జూన్, జూలై మొదటివారం వరకు సర్వే నిర్వహించానని ఆయన తెలిపారు. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ 93 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందని అన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న వాటిలో సగం స్థానాల్లో గెలిచినా..  ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  

ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో  మాట్లాడారు.  వైసిపి కచ్చితంగా గెలిచే స్థానాలు 7 నుంచి 8 ఉన్నాయని, మరో మూడు నుంచి నాలుగు స్థానాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఇంగ్లీషు ఛానెల్స్ సర్వేలను చూసి తమ పార్టీ నాయకులు మురిసిపోతూ కూర్చుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో సర్వే ఫలితాలను ఆయన చదివి వినిపించారు. 

కానిస్టేబుల్ పై రఘురామ కృష్ణంరాజు కుటుంబసభ్యులు దాడి.. కిడ్నాప్ చేసి చిత్రహింసలు..

ఇదిలా ఉండగా, ఇలాంటి కామెంట్సే గతంలోనూ రఘురామ చేశారు. ఏప్రిల్ 9న ఢిల్లీలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చుని సొంత పత్రిక చదవడం మానేసి మారువేషంలో ప్రజల్లో తిరిగినా..  ఇంటిలిజెంట్ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా..  సోషల్ మీడియాల్లో  తిట్టే తిట్లు చూసుకున్నా..  ఆయన గుండె ఆగిపోతుందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతలు అంటే ఊరుకునేది లేదన్న అధికారి ఢిల్లీకి మారిపోయారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని..  రాష్ట్రంలో చేతకాని దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమను చూసి ప్రతిపక్షాలు, పత్రికలు ఏడుస్తున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నందుకా..  మరి ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు.. అని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్రంలోవాలంటీర్ల వ్యవస్థే దరిద్రం అంటే వాళ్లకు సేవారత్న, సేవావజ్ర అంటూ కోట్లతో అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పింఛన్ల డబ్బు తీసుకుని ప్రియురాలితో  వాలంటీర్ వెళ్ళిపోయాడు.. అనే వార్తలు వస్తున్నాయి అన్నారు. చిన్న పిల్లలు ఏడిస్తే  బలం అని నానుడి ఒకటి ఉందని..  దానికోసం జగన్మోహన్ రెడ్డి కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారు అని.. సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటున్నారని.. దానికి జగనన్న బాల దీవెన అని పేరు పెట్టాలని ఆయన సూచించారు.

వెంట్రుకలు కాదు..  మనల్ని పీకేస్తారు..
తన వెంట్రుక కూడా పీకలేరు అని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆయన వెంట్రుకలతో ఎవరికి ఏం పని అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలు ఆగ్రహిస్తే మనల్ని పీకేస్తారని తెలిపారు. వెంట్రుకలు పరీక్షించుకోవాలంటే ముఖ్యమంత్రి తన బాధ్యతలను తాత్కాలికంగా పెద్దిరెడ్డికి అప్పగించాలని సూచించారు. మంత్రులుగా  పెద్దిరెడ్డి, కొడాలి, బొత్స లను  మంత్రివర్గం నుంచి తొలగించిన మళ్ళీ తీసుకుంటారని.. వారిని తొలగిస్తే పార్టీకి సమస్యలు ఎదురవుతాయని అన్నారు. 

సామాజిక న్యాయం ఎస్సి, బిసీలకు పదవులు అంటూనే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రారెడ్డి ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆయన విమర్శించారు..తిరుపతి జిల్లాలో అన్ని పదవుల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గం వారే ఉన్నారంటూ వారి పేర్లు చదివి వినిపించారు. సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాలని ఆయన జగన్మోహన్రెడ్డికి సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios