ఎంపీగా వుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ శుక్రవారం స్పీకర్‌ను కలిశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణంరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌కు భరత్ విజ్ఞప్తి చేశారు. 

కాగా, బెయిల్ మీద విడుదలైన తర్వాత వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏదో రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని సుప్రీంకోర్టు విధించిన షరతును పాటిస్తూనేవేర్వేరు రూపాల్లో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 

ALso Read:దోచేస్తున్నారు: పోలవరంపై ఫిర్యాదు, గజేంద్ర షెకావత్ కు కాలి చూపించిన రఘురామ

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వృద్ధాప్య పింఛన్లను ఈ నెల నుంచి రూ.2,750కి పెంచి ఇవ్వాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఏడాదిగా పెండింగులో ఉన్న పింఛనును కూడా కలిపి రూ. 3 వేలు ఇవ్వాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛనును రూ. 2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో వైసీపి హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని ఆయన అన్నారు. 

అంతకుముందు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లోక్‌సభ స్పీకర్, ఎంపీలుకు రఘురామ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను, కుంభకోణాలను మీడియా ద్వారా బయటపెడుతున్నందుకే తనపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆయన ఆరోపించారు అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేయడం వల్లనే తనపై రాజద్రోహం కింద కేసు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఐడి పోలీసులతో తనపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. సిఐడి కస్టడీలో తనను గాయపరిచారని ఆయన చెప్పారు. తన అరిపాదాలకు అయిన గాయాలను ఆయన గజేంద్ర షెకావత్ కు చూపించినట్లు తెలుస్తోంది.