పులివెందుల ‘జన్మభూమి’ లో గందరగోళం

First Published 3, Jan 2018, 5:07 PM IST
YCP MP avinash mike cut in CM Naidus meeting Kadapa
Highlights
  • కడప జిల్లా పులివెందులలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం రేగింది.

కడప జిల్లా పులివెందులలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం రేగింది. రెండో రోజు కార్యక్రమంలో చంద్రబాబునాయుడు జిల్లాలోని పులివెందులలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా అంటేనే వైఎస్సార్ జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ పులివెందుల అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం కూడా ఏరికోరి పులివెందులను వేదికగా నిర్ణయించింది. మరి, చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమే కదా? అందుకనే చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు వైసిపి ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఇక్కడే సమస్య మొదలైంది. చంద్రబాబు సమక్షంలోనే కడప ఎంపి అవినాష్ రెడ్డి వేదికపై నుండి దివంగత వైఎస్ఆర్ జిల్లాకు చేసిన సేవలను పొగడటం ప్రారంభించారు. దాంతో చంద్రబాబులో చిర్రెత్తింది. వైఎస్ఆర్ గురించి ఇక్కడ పొగడాల్సిన అవసరం లేదంటూ అభ్యంతరం చెప్పారు. అయినా అవినాష్ పట్టించుకోలేదు. దాంతో ఎంపి చేతిలో నుండి మైక్ ను లాక్కోవాలని చూసారు. సాధ్యం కాకపోవటంతో మైక్ కనెక్షన్ కట్ చేయించారు.  

దాంతో వైసిపి నేతలు అభ్యంతరం చెప్పటంతో టిడిపి నేతలు కూడా రెచ్చిపోయారు. దాంతో వేదికపైనే కాసేపు గందరగోళం రేగింది. మొత్తానికి ఎంపితో పాటు వైసిపి నేతలను వేదికపై నుండి దింపేసారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాలు తగవన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఎంపి చేసిన వ్యాఖ్యలను కూడా తాను ఖండించనంటూ చెప్పటంతో గందరగోళం సద్దుమణిగింది.

loader