వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను తన కారులో స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్లితే శ్రీకాంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నారు.

ఈ క్రమంలో కడప జిల్లా రామాపురం మండలం బండపల్లె వద్ద ఒక కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన శ్రీకాంత్ రెడ్డి వెంటనే తన కారును ఆపి స్వయంగా ఘటనాస్థలికి వెళ్లారు.

తన సిబ్బందితో కలిసి క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108కి ఫోన్ చేశారు. ఎంతసేపు చూసినా అంబులెన్స్ జాడ లేకపోవడంతో వెంటనే తన కారులోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో గాయపడిన వారిని చేర్పించి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు.