వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బాధపడుతున్న వారికి సహాయం అందించి... తన చేతులతో ఒకరి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గుంటూరు సమీపంలోని పెదకాకానిలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  గుంటూరుకు చెందిన కొమ్మూరి చంద్రశేఖరరావు, మస్తాన్‌ మంగళగిరి సమీపంలోని నవులూరు పుట్ట వద్ద పూజలు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరుగుప్రయాణమయ్యారు. పెదకాకాని వద్ద వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి వారి బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖరరావు(65) అక్కడికక్కడే మృతి చెందగా మస్తాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అదే సమయంలో ఎమ్మెల్యే విజయవాడ నుంచి గుంటూరు వస్తున్నారు. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన ఆమె వెంటనే స్పందించారు.   స్వతహాగా వైద్యురాలయిన శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి పరుగుపరుగున గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేంత వరకూ శ్రీదేవి అక్కడే ఉన్నారు.

అంబులెన్స్ వచ్చిన వెంటనే స్థానికులు ఆ వ్యక్తిని అంబులెన్స్ లోకి ఎక్కించారు.అంబులెన్స్ లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో శ్రీదేవి క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. తలకు గాయాలైనందున ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా అంబులెన్స్ డ్రైవర్ కి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  మానవత్వంతో  ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఆమె మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.