వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఆమె చేసిన నిర్వాకమే. అతి వేగంగా వాహనాన్ని నడుపుతూ... రోడ్డు పై వెళ్తున్న ఓ యువకుడిని ఎమ్మెల్యే వాహనం ఢీ కొట్టింది. కాగా...కనీసం ఎమ్మెల్యే బాధితుడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రజనీ కారులో అసెంబ్లీకి అతి వేగంగా వెళ్తున్నారు. ఆ సమయంలో.. బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే... కనీసం ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించకపోవడం గమనార్హం.

ప్రమాదం జరగగానే వెంటనే కారు దిగి ఆటో ఎక్కి ఆమె అసెంబ్లీకి వెళ్లిపోయారు.  ఆమె గన్ మెన్లు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. నిడమర్రు రోడ్డు బాపూజీ నగర్ చార్వాక ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. నవీన్ ఇంటర్ వరకు చదివాడు.తల్లిదండ్రులు లేకపోవడంతో అతడు కూలీ పని చేసుకొని బతుకుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.