ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్, అధికారులు గైర్హాజరు కావడంపై వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని సీరియస్ అయ్యారు. 

విజయవాడ : ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల తీరుపై మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం మాజీ మంత్రికి కోపం తెప్పించింది. దీంతో ఏలూరు కలెక్టర్, అధికారులు సమావేశానికి రాకుంటే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిముందే బైఠాయించి నిరసనకు దిగుతామని నాని హెచ్చరించారు. 

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు జడ్పిటిసిలు, అధికారులు పాల్గొన్నారు. అయితే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, అధికారులంతా ఈ జడ్పి సమావేశానికి హాజరవగా ఏలూరు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు గానీ హాజరుకాకపోవడంతో మాజీ మంత్రి కోపం కట్టలు తెంచుకుంది. ఇలా మరోసారి జడ్పి సమావేశానికి గైర్హాజరయితే నేరుగా సీఎం, సీఎస్ కార్యాలయాల వద్దే నిరసన చేస్తామని హెచ్చరించారు. 

వీడియో

జడ్పీ మీటింగ్ లకు హాజరయ్యే ఉద్దేశం ఏలూరు కలెక్టర్ కు లేదా..? అని మచిలీపట్నం ఎమ్మెల్యే నాని నిలదీసారు. ఇలా వ్యవస్థలనే లెక్కచేయకపోవడం తగదని... నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. ఈ బరితెగింపుతనం ఎంతటి అధికారికైనా మంచింది కాదన్నారు. ఏలూరు కలెక్టర్, అధికారుల తీరును సీరియస్ గా తీసుకోవాలని జడ్పీ ఛైర్ పర్సన్ కు నాని సూచించారు. తీరు మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, జడ్పిటిసిలతో కలిసి సిఎం ఇంటిముందు లేదంటే చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని తీర్మానం చేయాలని మాజీ మంత్రి నాని సూచించారు.