అలిపిరిలో చిన్నారి లక్షిత మృతిపై తనకు అనుమానాలున్నాయని.. తల్లిదండ్రులను విచారించాలని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

తిరుమల : తిరుమల అలిపిరి దారిలో చిన్నారి మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారి లక్షిత మృతిపై తనకు అనుమానాలున్నాయన్నారు. చనిపోయింది ఆడపిల్ల కావడంతో ఈ మృతిపై అనుమానాలొస్తున్నాయన్నారు. బాలిక తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించాలన్నారు. 

కుటుంబంలో గొడవలు ఉండడం... చిన్నారిని తల్లిదండ్రులతో కాకుండా ముందుగా వెళ్లడం.. మొదటి సారి మిస్సవ్వడం, అక్కడున్న మజ్జిగ అమ్మేవాళ్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడం.. సీసీ టీవీ ఫుటేజీల్లో చాలా చోట్ల పాప ఒంటరిగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపిస్తుంది. 

తిరుమలలో చిన్నారిపై దాడి చేసింది చిరుత కాదా?.. ఫారెస్ట్ అధికారులు ఏం చెబుతున్నారంటే..

ప్రసన్నకుమార్ రెడ్డి ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. ‘ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ భూమనతో మాట్లాడాను. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. నెల్లూరుకు చెందిన కుటుంబానికి ఇలా జరగడం విచారకరం.. అయితే, ఇద్దరు ఆడపిల్లలు కావడం, కుటుంబంలో గొడవలు ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిమీద తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించాలి’ అన్నారు. 

మరోవైపు, చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. లక్షిత మృతదేహం నెల్లూరుకు తరలించారు. చిన్నారిని చిరుతే చంపిందని ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా చిరుతే దాడి చేసి చంపిందని ఆధారాలు సేకరించారు. ఈ రోజు సాయంత్రం వరకు లక్షితకు అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.