తిరుమల కాలినడక మార్గంలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బాలికపై చిరుత దాడి చేసి చంపేసిందని భావిస్తున్నారు. అయితే తాజాగా బాలికపై దాడి చేసింది చిరుత కాదని.. ఎలుగుబంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తిరుమల కాలినడక మార్గంలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బాలికపై చిరుత దాడి చేసి చంపేసిందని భావిస్తున్నారు. అయితే తాజాగా బాలికపై దాడి చేసింది చిరుత కాదని.. ఎలుగుబంటి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షిత మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత ఫారెస్ట్ అధికారులు పలు అనుమాలు వ్యక్తం చేశారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను పరిశీలిస్తే.. ఎలుగుబంటి దాడిలా కనిపిస్తోందని చెప్పారు. బాలికపై చిరుత దాడి చేసిందనేది కూడా ఎవరూ చూడలేదని పేర్కొంటున్నారు. 

అయితే పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. బాలిక మెట్ల నుంచి పక్కకు వెళ్లిన సమయంలో చిన్నారిపై దాడి జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టమ్ రిపోర్టు తర్వాతనే బాలికపై ఏ జంతువు దాడి చేసిందనే దానిపై క్లారిటీ రానుంది. 

అసలేం జరిగిందంటే.. 
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్షిత తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరింది. యాక్టివ్‌గా ఉన్న పాప కుటుంబ కంటే ముందుకు నడుచుకుంటూ వెళ్లడం చేసింది. అయితే మరో కిలోమీటన్నర నడిస్తే తిరుమలకు చేరుకుంటారనగా.. పాప వారి కుటుంబ సభ్యులు ఉన్న గుంపు నుంచి వేరుపడింది. ఈ క్రమంలో పాపతో కుటుంబ సభ్యులకు కాంటాక్ట్స్ తెగిపోయాయి. 

ఈ క్రమంలోనే లక్షిత కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. లక్షిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై రాత్రి 
10.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు చెప్పారు. ఇక, బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పాపపై దాడి చేసిన జంతువు సగానికి తిని వదిలివెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే, లక్షిత చాలా యాక్టివ్ ఉందని.. కుటుంబ సభ్యుల కంటే ముందు వెళ్లసాగిందని.. సీసీటీవీ కెమెరాల్లో కూడా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయిని.. ఈ క్రమంలోనే పాప గుంపు నుంచి వేరుపడిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

ఇక, గత కొద్ది కాలంగా ఘాట్ రోడ్లపై చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం అధికమైన సంగతి తెలిసిందే. దీంతో రాత్రి వేళల్లో భద్రత సిబ్బంది, అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, గత నెల మెట్ల మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే.