నెల్లూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ల తీరుపై మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి వెళ్తే... లాక్ డౌన్ ఉల్లంఘన అంటూ నోటీసులివ్వడంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. జిల్లామంత్రులు మేకపాటి, అనిల్ కుమార్ లు దీనిపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేసారు. 

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసినప్పుడు పక్కనున్న అధికారులపై కేసులు పెట్టడం ఏమిటని ఆయన పోలీసులను నిలదీశారు. రూల్స్ తనకు కూడా బాగా తెలుసని, దమ్ముంటే తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సవాల్ విసిరారు. 

ఇలా కేసులు నమోదు చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఒక్క అధికారి సస్పెండ్ అయినా కూడా ఊరుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. బయట ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు చెమటలు గక్కుతూ రోడ్ల మీద పనిచేస్తుంటే... ఏసీ రూముల్లో కూర్చునే అధికారులకి వీరి కష్టాలు ఎలా తెలుస్తాయని అన్నారు. 

ఇకపోతే...,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 62 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,525కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 33 మంది మరణించారు.   

గత 24 గంటల్లో 5943 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 441 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1051 ఉంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కర్నూలు జిల్లా కరోనా వైరస్ తో అట్టుడుకుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాకు కొంత ఊరట లభించింది. గత 24 గంటల్లో 2 కరోనా కేసులు మాత్రమే బయటపడ్డాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. కర్నూలు జిల్లా 436 కేసులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుంటూరు జిల్లా 308 కేసులతో రెండో స్థానంలో ఉంది.