ఇంకా ఏం పీకాలి: చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై, మాజీ మంత్రులు నారా లోకేష్, అయ్యన్నపాత్రుడులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పీకేశారని ఆమె అన్నారు.
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, మంత్రులపై అయ్యన్నపాత్రుడు బూతులతో విరుచుకుపడ్డారు. రాయకూడని భాషలో తిట్లదండకం అందుకున్నారు. దానిపై రోజా ప్రతిస్పందించారు.
రోజా శనివారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు అయ్యన్న ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని పీకేశారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పీకేశారని ఆమె అన్నారు. అడ్డదారిలో మంత్రి అయిన నారా లోకేష్ పదవిని కూడా పీకేశారని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను ప్రజలు పీకేశారని, ఇంకా పీకాలని రోజా అన్నారు.
అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు బాధాకరమని ఆమె అన్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు రోజా తెలిపారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా కొడెల శివప్రసాదరావును మానసిక క్షోభకు గురి చేశారని, అప్పుడు అయన్నపాత్రుడు ఏమయ్యారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలని ఆమె అన్నారు.
Also Read: చర్చి ఫాదర్లు ‘‘ ఓ మై సన్’’ అంటారు.. నేను తెలుగులో అన్నా, ఇది బూతా: వైసీపీ నేతలపై అయ్యన్న ఆగ్రహం
సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలనే నిర్ణయాన్ని చిరంజీవి, నాగార్జున కోరడం వల్లనే ప్రభుత్వం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం బెల్టు షాపులను తొలగించడమే కాకుండా 33 శాతం మద్యం దుకాణాలను ఎత్తేసిందని ఆమె చెప్పారు.