చర్చి ఫాదర్లు ‘‘ ఓ మై సన్’’ అంటారు.. నేను తెలుగులో అన్నా, ఇది బూతా: వైసీపీ నేతలపై అయ్యన్న ఆగ్రహం

ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని.. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నానన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. తన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారని.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించానని అయ్యన్న వెల్లడించారు. 

it is not right to attack opposition party leader chandrababu naidu says ayyanna patrudu

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబును హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మాజీ స్పీకర్ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో గురువారం కోడెల విగ్రహావిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు సీఎం, మంత్రులపై విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యల్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, పార్టీ శ్రేణులు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. ఈక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై విశాఖ నర్సీపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న  స్పందించారు. 

మంత్రులు చేసిన పనులు మాత్రమే సభలో చెప్పానని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్ధతి కాదన్నారు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని తాను తిట్టలేదని.. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నాను. తన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారని.. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించానని అయ్యన్న వెల్లడించారు. తన మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. 

ALso Read:టిడిపి, వైసిపి ఫైట్ ఎఫెక్ట్... తాడేపల్లి జగన్ నివాసంవద్ద భారీ పోలీస్ బందోబస్తు

పిచ్చి తుగ్లక్ పరిపాలన చేసేవాడిని పిచ్చి తుగ్లక్ అని కాకుండా ఏమంటారని ఆయన నిలదీశారు. రైతుల సమస్యలపై మాట్లాడితే దౌర్జన్యం చేస్తారా అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్‌పై అభిమానం వుంటే ఆయనకు సేవ చేసుకోవాలంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు. చెత్తపై పన్నువేసిన వారిని చెత్త పాలన అంటారని.. నిరంతరం బూతులు మాట్లాడేవాడిని బూతుల మంత్రి అనడం తప్పా అని అయ్యన్న నిలదీశారు. 

నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబును ఉరితీయాలి అన్న జగన్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చంద్రబాబును తిట్టినా పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని అయ్యన్న నిలదీశారు. తాను అరెస్ట్‌కు సిద్ధమేనని ... నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం చేసేది అధికార పార్టీవారేనని ఆయన ఆరోపించారు. తాను ప్రభుత్వ విధానాలపై మాట్లాడాను తప్ప.. వ్యక్తిగతంగా మాట్లాడలేదని అయ్యన్న స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios