ముఖ్యమంత్రి జగన్, తనపైనా అవినీతి ఆరోపణలు చేసిన నారా లోకేష్ కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

పిడుగురాళ్ల : చంద్రబాబు నాయుడు, లోకేష్ ల ఇంటిపేరు నారా కంటే సారా అంటేనే సరిగ్గా వుంటుందని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎద్దేవా చేసారు.చంద్రబాబు హైదరాబాద్ లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.300 కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకున్నాడని... ఇది సారా డబ్బులతోనే కట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. లోకేష్ కూడా సారా డబ్బులతో పెరిగాడు... ఆ డబ్బులతో కట్టిన ఇంట్లోనే వుంటున్నాడు కాబట్టి నారా కాదు సారా అయ్యాడని అన్నాడన్నారు. అవినీతికి చక్రవర్తి లాంటివాడు చంద్రబాబు నాయుడు... అలాంటి లోకేష్ సీఎం జగన్, తనపైనా అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా వుందన్నారు ఎమ్మెల్యే కాసు. 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ పై అవినీతి ఆరోపణలు చేసారు. లోకేష్ ఆరోపణలను తాజాగా మహేష్ రెడ్డి తిప్పికొట్టాడు. 

వీడియో

లోకేశ్ గురజాల నియోజకవర్గానికి ఏం చేసాడో చెప్పలేదు.. వచ్చాడూ, వెళ్ళాడు అన్నట్లు ఆయన పర్యటన సాగిందన్నారు. తన సెల్ఫీ ఛాలెంజ్ కు సమాధానం చెప్పే దమ్ములేక లోకేశ్ తోకముడుచుకుని పారిపోయాడన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే... చివరకు టిడిపి కేంద్ర కార్యాలయంలో అయినా సరే చర్చకు సిద్ధమని అన్నారు. అన్నీ అబద్దాలు చెబుతూ లోకేష్ పబ్బంగడుపుకుంటున్నారని ఎమ్మెల్యే మహేష్ అన్నారు. 

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ.50 కోట్ల అవినీతి సొమ్ముతో గుంటూరులో ఇల్లు కట్టుకున్నాడని కాసు మహేష్ ఆరోపించారు.మరుగుదొడ్ల నిధులు సైతం కాజేసిన యరపతినేని అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. అక్రమ మైనింగ్ , పేకాట క్లబ్ లు నడిపిన సంస్కృతి యరపతినేని అని ఎమ్మెల్యే ఆరోపించారు. లోకేష్, యరపతినేని లాంటి అజ్ఞానులు ఉంటేనే సీఎం జగన్ విలువ జనాలకు తెలుస్తుందన్నారు. 

ఇప్పటికే వైసిపి ప్రభుత్వం పిడుగురాళ్ళ పట్టణంలో 8000 ఇళ్ళకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే రెండు నెలల్లో పిడుగురాళ్ళ బైపాస్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. భవిష్యత్ లో టిడిపి అధికారంలోకి వచ్చేది లేదు... అయినా ఇక్కడ చేయడానికి వారికి పెద్దగా పని కూడా లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.