టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంలోకి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చేరారు.

ఎంపీ విజయసాయి రెడ్డి మీద వెలగపూడి ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. వెలగపూడి తీరు చూసి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని గుడివాడ వ్యాఖ్యానించారు.

విజయసాయి రెడ్డికి సవాల్ చేసే స్థాయి వెలగపూడికి లేదని తేల్చి చెప్పారు.  ప్రమాణాలు చేస్తామనడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. 

వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని..  ఆయన అక్రమాలు ప్రజలందరికీ తెలుసునని గుడివాడ ఆరోపించారు. ఆయనను బెజవాడలో బహిష్కరిస్తే వైజాగ్‌ వచ్చాడని ఎద్దేవా చేశారు.

Also Read:వంగవీటి హత్యతో విశాఖ పారిపోయారు: వెలగపూడిపై విజయసాయి ఫైర్

చంద్రబాబు 420 అయితే.. వెలగపూడి 840 అంటూ అమర్‌‌నాథ్ రెడ్డి సెటైర్లు వేశారు. తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదు చేయించి గెలిచాడని గుడివాడ ఆరోపించారు.

విశాఖ ప్రజలు రాజకీయంగా ఆదరిస్తే విశాఖ పరిపాలన రాజధాని కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని.. మరో వారం రోజుల్లో సిట్‌ నివేదిక వస్తుందని అమర్‌నాథ్ తెలిపారు.

ఆ నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. సిట్ నివేదికలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. రంగాను హత్య చేసి వైజాగ్ పారిపోయి వచ్చినప్పుడు వెలగపూడి ఆస్తులు ఎంత..?... ఇప్పుడు ఎంతో సమాధానం చెప్పాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.