టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్‌పై స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దేవుడిపై నమ్మకం లేని వాడు ఎవరిపైనైనా ప్రమాణం చేయగలడని ఆయన ఎద్దేవా చేశారు.

వంగవీటి హత్య తర్వాత వెలగపూడి విశాఖకు పారిపోయాడని విజయసాయి ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ భూకబ్జాలు, హత్యలు చేశాడని విజయసాయి ఆరోపించారు.

వెలగపూడికి బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడిపై ప్రమాణం చేయడమేంటని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.

విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా..? లేదా ఒక గూండా, రౌడీ ఎలిమెంటుగా భావిస్తున్నారా..? అని విజయసాయి ప్రశ్నించారు.

కాగా, వెలగపూడి రామకృష్ణ భూ అక్రమాలకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించగా.. తాను రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నానే కానీ సంపాదించుకోలేదని ఎమ్మెల్యే బదులిచ్చారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని వెలగపూడి సవాల్ విసిరారు.