టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైరయ్యారు. అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన నాడు శాసనమండలిని చంద్రబాబు అనవసరం అన్నారని గుర్తుచేశారు.

టీడీపీ అధినేత సభకు ఎందుకు రాలేదని అంబటి ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపించడానికి వెనుకడుగు వేశారని, ఆ బాధ్యత నుంచి ఎందుకు దూరం జరిగారని ఆయన నిలదీశారు.

Also Read:శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

వైఎస్ హయాంలో శాసనమండలిని పునరుద్ధరణ చేయాలని అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కౌన్సిల్ వద్దన్న ఆయన.. ఇప్పుడు మాత్రం మండలి రద్దు చేయడం తప్పని విచిత్రంగా మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు తాము ప్రయత్నించలేదని, ఆ అవసరం కూడా తమకు లేదని రాంబాబు తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దుర్బుద్ధితో కూడిన రాజకీయాలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. శాసనమండలిలో మేధావులు, మేధావులు కానీ వారు ఉన్నారని రాంబాబు తెలిపారు.

కౌన్సిల్ అంటే పెద్దల సభని.. చిత్రంగా పెద్దాయన చంద్రబాబు అసెంబ్లీలో, చిన్న కుర్రాడు నారా లోకేశ్ మండలిలో కూర్చొన్నాడని రాంబాబు సెటైర్లు వేశారు. రాజకీయాల్లో అ, ఆ లు రానీ వ్యక్తి.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్లి పెద్దల సభలో కూర్చొబెట్టడం సబబు కాదని అంబటి తెలిపారు.

Also Read:రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్

కౌన్సిల్ అంటే రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చేది, కుమారులను మంత్రులుగా చేసేది కాదన్నారు. మండలిని రద్దు చేయడానికి చంద్రబాబే కారణమని రాంబాబు ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు ఆలస్యమైనా, మండలి రద్దయి, తీరుతుందని ఇందులో సందేహం లేదని అంబటి తెలిపారు.