ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది దీనిపై స్పందించగా.. తాజాగా... ఈ జనసేన, బీజేపీ పొత్తుపై అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గువాడ అమర్నాథ్ మాట్లాడారు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల తమ పార్టీ ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పారు. 

పవన్ పార్టీకి అసలు సిద్ధాంతాలు లేవని.. ఆయన ఫ్రీలాన్స్ పొలిటీషియన్ అని   ఆయన ఆరోపించారు. బీజేపీ - జనసేన కూటమితో తమకు నష్టం లేదన్నారు. జగన్‌పై బీజేపీ-జనసేన నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేనను స్థాపించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్‌ సర్పంచ్‌గా పోటీ చేసి గెలవాలని... ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న మాటలు మాట్లాడాలని సవాల్ విసిరారు. 

Also Read బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తుపై చంద్రబాబు గప్ చుప్: అంచనా ఇదీ....

అన్ని ప్రాంతాలకు మేలు చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం పోరాడుతూనే ఉంటామని వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్‌ స్పష్టం చేశారు. తమ పార్టీ పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇదే విషయంపై మరో ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పందించారు. 2014లో బీజేపీతో, 2019లో వామపక్షాలతో, తిరిగి ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రమే  చెల్లిందని సుధాకర్ బాబు అన్నారు. 

స్థిరత్వం లేని మనస్థత్వం, సిద్దాంతంలేని రాజకీయం, అస్తిరమైన చంచలమైన బుద్ది... పవన్‌ కళ్యాణ్‌కు కవచకుండలాలని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు పాచిపోయిన లడ్డూలు బీజేపీ ఇచ్చిందని విమర్శించిన పవన్‌... ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వెనక ఎలాంటి లడ్డూలు బీజేపీ ఇచ్చిందో, వాటి విలువ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. 

జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేని వారంతా మూకుమ్మడిగా ఒక్కటవుతున్నారని విమర్శించారు. ముందుగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించి ఇప్పుడు జనసేనతో కూటమి కట్టించడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అవడం ఖాయమని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.