లోకేష్ కు జగన్ కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. : కన్నబాబు

తిరుపతి ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసిన చంద్రబాబు, లోకేష్‌ హైడ్రామాకు తెర తీశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరి బతుకు రాజకీయ డ్రామాగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ycp minister kurasala kannababu fires on nara lokesh - bsb

తిరుపతి ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసిన చంద్రబాబు, లోకేష్‌ హైడ్రామాకు తెర తీశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరి బతుకు రాజకీయ డ్రామాగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

మొన్న తనపై ఎవరో రాళ్ళు విసిరారు అంటూ, వారి తాట తీస్తాను, తోలు తీస్తాను అని  చంద్రబాబు హూంకరించగా, ఇవాళ ఆయన కుమారుడు లోకేష్‌ పవిత్రమైన అలిపిరి వద్ద రాజకీయ సవాళ్ళు చేస్తూ మరో కొత్త నాటకం ప్రదర్శించారని అన్నారు.

బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ వివరాలు ఇలా ఉన్నాయి.. 

సీఎం వైయస్‌ జగన్‌ 45 నిమిషాల్లో అలిపిరి వద్దకు రావాలని, తన సవాల్‌ను స్వీకరించి ప్రమాణం చేయాలన్న లోకేష్‌ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన అజ్ఞానం బయట పడుతోంది. అసలు లోకేష్‌ స్థాయి ఏమిటి? ఆయన బతుకు ఎంత?. సమర్థుడైన సీఎంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వైయస్‌ జగన్‌ గారిని సవాల్‌ చేసే స్థాయి తనకు ఉందని లోకేష్‌ అనుకుంటున్నాడా?.

 వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎటువంటి సంబంధం లేదని లోకేష్‌ అలిపిరి వద్ద ప్రమాణం చేశాడు. అలాగే సీఎం వైయస్‌ జగన్‌ కూడా వచ్చి ఆ హత్య కేసుతో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ప్రమాణం చేయాలని లోకేష్‌ ఎలా సవాల్‌ చేస్తాడు? లోకేష్‌ పిచ్చిమాటలు, పిచ్చి చేష్టలు, బుర్ర తక్కువతనంతో వ్యవహరిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం...

నిజంగా అలిపిరి వద్ద లోకేష్‌ ప్రమాణం చేయాల్సి వస్తే ఎన్టీఆర్‌ను తన తండ్రి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని, అధికారం నుంచి దించేయలేదని, ఆయన మరణానికి కారణం కాదని, తన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని, ఇల్లు రక్తసిక్తం కాలేదని, బాలకృష్ణ ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయాలి. అలాగే తన ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు బలి అయ్యేందుకు చంద్రబాబు కారకుడు కాదని, సొదరుడు రామ్మూర్తినాయుడిని గొలుసులతో బంధించలేదని ప్రమాణం చేయాలి.

వివేకా హత్య కేసును సీఎం వైయస్‌ జగన్‌ కేసును సీబీఐకి అప్పగించారు. స్వేచ్చగా దర్యాప్తు చేయాలని కోరారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కేసుతో ఏమిటి సంబంధం? ఈ విషయం లోకేష్‌కు అర్థం కావడం లేదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టకుండా జీఓలు ఇచ్చాడు. 

అవన్నీ మర్చిపోయిన లోకేష్‌ ఇప్పుడు తాను ప్రమాణం చేస్తాడట, ప్రతిగా సీఎం వైయస్‌ జగన్‌ కూడా ప్రమాణం చేయాలంటూ పిచ్చి మాటల మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐపై జగన్‌ కి నమ్మకం ఉంది. దమ్మున్న నాయకుడిగా ఎటువంటి విమర్శలు రాకూడదనే వివేకా కేసును ఆయన సీబీఐకి  అప్పగించారు. అంతేకాదు అంతర్వేధిలో రథం తగులబడిన కేసు కూడా సీబీఐకి అప్పగించారు.
 
మాస్‌ హీరోగా లోకేష్‌ను చూపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దాని కోసం ఇప్పటికే ఒక ట్రైనర్‌ను పెట్టారు. ట్రైనింగ్‌లో నేర్చుకున్న వాటిని మక్కీకి మక్కీ అలిపిరి వద్ద లోకేష్‌ ప్రదర్శించాడు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వివేకా హత్యను కావాలనే లోకేష్‌ రాజకీయం చేస్తున్నాడు. 

తమ హయాంలో ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టడం, విభజన హామీలను నెరవేర్చలేని అసమర్థతను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే ఇప్పుడు వివేకా హత్యకేసును ముందుకు తెస్తున్నారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడాలనే కనీస జ్ఞానం చంద్రబాబు, లోకేష్‌లకు లేదు. చివరికి ఇళ్ళలోని మహిళలను కూడా రోడ్డు మీదకు తీసుకువస్తున్నారు. 

మహిళలు అంటే వైయస్‌ జగన్‌కు ఎంతో గౌరవం ఉంది. రాష్ట్రంలో ప్రతి అక్క  ప్రతి చెల్లెమ్మ జగన్‌ని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి నాయకుడి సోదరీమణులను వివాదాల్లోకి లాగుతూ లోకేష్‌ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లోకి వస్తే సంస్కారం వదిలేయాలని లోకేష్‌ అనుకుంటున్నాడా?

తాడేపల్లిలోని ప్యాలెస్‌లో  వైయస్‌ జగన్‌ ఉన్నాడంటూ పదే పదే లోకేష్‌ మాట్లాడుతున్నాడు. తాడేపల్లిలోని మా నాయకుడి నివాసాన్ని మీరు చూసేందుకు అనుమతి తీసుకుంటాం. అలాగే హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన చంద్రబాబు నాయుడి నివాసాన్ని కూడా మేం చూసేందుకు అనుమతి ఇస్తారా? ఎవరిది ప్యాలెసో, ఎవరిది అత్యంత విలాసవంతమైన భవనమో ప్రజలే నిర్ణయిస్తారు.

లోకేష్ వస్తే... కొంప‌లో పిల్లిలా న‌క్కి దాక్కున్నావేం జ‌గ‌న్‌రెడ్డి...: అచ్చెన్న ఆగ్రహం...

ఒక సామాన్యుడి నివాసంలా తన భవనాన్ని వైయస్‌ జగన్‌ నిర్మించుకున్నారు. మీ అసమర్థత వల్ల తాత్కాలిక భవనాలతో రాజధానిని భ్రష్టు పట్టించడం వల్ల ఆయన తన నివాసంలోని ఒక గదిలో సీఎంగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటువంటి ఆయన నివాసాన్ని ప్యాలెస్‌ అంటూ మాట్లాడి ప్రజల్లో జగన్‌ రాజరికంతో ఉన్నారనే తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు లోకేష్‌ ప్రయత్నిస్తున్నాడు. 

లోకేష్‌కు, వైయస్‌ జగన్‌కు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. శ్రీ వైయస్‌ జగన్‌ తన ఒంటిచేత్తో 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిపించుకున్నారు. మరి మంగళగిరిలో పోటీ చేసి, తన నియోజకవర్గంలోనే  దారుణంగా ఓడిపోయిన లోకేష్‌ వైయస్‌ జగన్‌ ని సవాల్‌ చేయడం ఏమిటి? ఢిల్లీ నుంచి గల్లీస్థాయి వరకు వైయస్‌ జగన్‌  అత్యంత సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  అటువంటి జగన్‌ ని సవాల్‌ చేసే స్థాయి ఏ రకంగా చూసినా లోకేష్‌కు లేదు. 

2019లో అనుకూల గాలి వచ్చింది, ఒక ఛాన్స్‌ అంటే  జగన్‌ కి ఓటు వేశారని లోకేష్‌ అంటున్నారు. జగన్‌  సీఎంగా అధికారంలోకి వచ్చిన రెండేళ్లు తిరగక ముందే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఎలా ఇచ్చారో లోకేష్, చంద్రబాబు సమీక్ష చేసుకున్నారా? తిరుపతి ఎన్నికల్లో  రెండో స్థానం కోసం టీడీపీ పోటీ పడుతోంది. చంద్రబాబు, లోకేష్‌కు బీజేపీని ఒక్క మాట కూడా అనే దమ్ము, ధైర్యం లేదు. అందుకే కేవలం  జగన్‌పై బుదరచల్లే కార్యక్రమం చేస్తున్నారు. 

నిన్న ఒక వీడియో హల్‌చల్‌ అయ్యింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ వీడియోలో మాట్లాడుతూ ఈనెల 17 వరకు తప్పదు, ఆ తరువాత పార్టీయా, బొక్కా అని తెలుగుదేశం పార్టీ గురించి అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి బాధే అలా వుంటే, టిడిపిలో సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏమిటీ? ఆ మాట మేం అంటే మాపై విరుచుకు పడతారు. మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా పార్టీ పరిస్థితి గురించి చెప్పాడు. 

అంతేకాదు లోకేష్‌ వల్లే మన పరిస్థితి ఇలా అయ్యిందని అన్నాడు. ఈ వీడియోతో టిడిపిలో అంతర్గతంగా వున్న దుస్థితి బయటపడింది. దానిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు 24 గంటలు దాటక ముందే లోకేష్‌ అలిపిరి వద్ద ప్రమాణం చేస్తూ కొత్త డ్రామా ఆడాడు. నిన్న టిడిపి గురించి అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో గురించి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ ప్రయత్నం. లోకేష్‌ డైవర్షనల్‌ పాలిటిక్స్‌ చేస్తున్నాడు.  

ఒకవైపు మీ అచ్చెన్నాయుడు చాలా స్పష్టంగా లోకేష్‌ వల్లే ఈ కష్టాలు అని చెబుతున్నాడు. మరోవైపు మీ పార్టీకి చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే పార్టీని బతికించాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని చెబుతున్నాడు. 

మీ పార్టీని సరి చేసుకోకుండా, ప్రజల్లో మీ దుస్థితి గురించి చర్చ జరగకుండా దృష్టి మళ్ళించేందుకు అలిపిరి డ్రామాకు లోకేష్‌ తెగబడ్డాడు. అందుకోసం మా నాయకుడు జగన్‌పై  బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు అనేక గుళ్ళను కూలగొట్టారు. పలు విగ్రహాలను తొలగించారు. అలాంటి మీరు వచ్చి ఈ రోజు పవిత్రమైన అలిపిరి వద్ద ప్రమాణం చేస్తారా? హిందూధర్మం మీద కనీస  గౌరవం లేని మీరు ప్రమాణం ఎలా చేస్తారు? గోదావరి పుష్కరాల్లో మీవల్ల సామాన్యులు చనిపోతే కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. 2019 ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోవడం మానేసి నిత్యం జగన్‌ గారి మీద అవాకులు, చవాకులు మాట్లాడి ఏం సాధిస్తారు?  

ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తోంది. లోకేష్‌ మాటలకు కూడా మేం వివరణ ఇవ్వాలా అని. జగన్‌  తన  సోదరిమణులను రోడ్డున పడేశాడనే పిచ్చిమాటలు మాట్లాడవద్దని లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడవద్దని చెబుతున్నాం. సీఎం  కుటుంబసభ్యుల గురించి మాట్లాడటం మర్యాద కాదని చెబుతున్నాం. రాజకీయాల్లో హుందాగా వుండాలి.  నందమూరి కుటుంబసభ్యులను అడిగితే చంద్రబాబు ఎన్టీఆర్‌కు చేసిన అన్యాయం, ద్రోహం గురించి  చెబుతారు. వారు దీనిపై పుస్తకాలే రాశారు. లోకేష్‌ ప్రచారం కోసం ఇటువంటి ప్రమాణాలు, కొత్త డ్రామాలు చేయవద్దని చెబుతున్నాం. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ఎన్నికల ప్రచారంలో పలు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపేస్తామని పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. పేదరికంలో వున్న వారికి ఆసరా కల్పించడం కోసం ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. నవరత్నాలతో జగన్‌ గారు నిరంతరం పేద, బడుగు వర్గాలన ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని నిలిపివేస్తామని నడ్డా ఎలా ప్రకటిస్తారు? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెత గుర్తుకు వస్తోంది. పేదలకు బిజెపి పెట్టదు. మరి జగన్‌ ని కూడా పెట్టనివ్వరా? 

 జగన్‌ లక్షల కుటుంబాలకు వేల కోట్ల మేలు చేస్తున్నారు. విభజన హామీలను బిజెపి ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా మాట్లాడిన దానిపై వివరణ ఇవ్వాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు. దానిపైన నడ్డా మాట్లాడరు. అప్పులు చేసి ప్రజలకు వైయస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలను నిలిపివేస్తామని మాత్రం అంటారా? కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ రాష్ట్రానికి అందించాల్సిన నిధులను ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని కూడా ఆపేస్తామని చెప్పడం చూస్తుంటే, పేదల పట్ల బిజెపికి వున్న ప్రేమ అర్థమవుతోంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తన పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడతారని అనుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారు. ద్రవ్యలోటు ఇవ్వాల్సిన మీరు దాని గురించి మాట్లాడరు. సంక్షేమ పథకాల నిలిపివేత నడ్డా కి వచ్చిన ఆలోచనా? లేక రాష్ట్ర ఇజెపి నాయకుడు ఇచ్చిన సలహానా?.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios